పాము కాటుకు సరికొత్త విరుగుడు
ఇంట్లో అల్లారుముద్దుగా పెంచుకునే పెంపుడు జంతువులు పాము కాటుకు బలై మరణిస్తే ఎంతో బాధగా ఉంటుంది. ప్రతియేటా ప్రపంచవ్యాప్తంగా వేలాది పెంపుడు జంతువులు ఇలా పాముల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇక మీదట ఇలా బాధపడాల్సిన అవసరం లేదు. ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు ఈ తరహా పాము కాటుకు విరుగుడు చికిత్సను కనుగొన్నారు. చాలా తక్కువ ఖర్చుతో, అత్యంత సమర్థంగా పనిచేసే విషం విరుగుడు మందును కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సీఎస్ఐఆర్ఓ) శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది ప్రధానంగా పిల్లులు, కుక్కలను పాము కాటు బారి నుంచి కాపాడుతుంది.
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పది రకాల పాములు ఆస్ట్రేలియాలోనే ఉన్నాయి. ఇవి తరచు పెంపుడు జంతువులను కాటేయడం.. వాటికి చికిత్స లేక అవి మరణించడం ఇటీవలి కాలంలో సర్వసాధారణంగా మారింది. దీంతో శాస్త్రవేత్తలు విక్టోరియా ప్రాంతంలోని చిన్న చిన్న బయోటెక్ కంపెనీలతో సమన్వయం చేసుకుని.. ప్రధానంగా ఈస్ట్ బ్రౌన్, టైగర్ పాముల కాటు నుంచి పెంపుడు జంతువులను రక్షించే మందును తయారుచేశారు. చాలాకాలంగా తాను పిల్లులు, కుక్కల కోసం విషం విరుగుడు చికిత్సను కనుగొనేందుకు పరిశోధనలు సాగిస్తున్నానని, అయితే సీఎస్ఐఆర్ఓ శాస్త్రవేత్తల నైపుణ్యం ఆ మందు తయారీకి ఎంతగానో ఉపయోగపడిందని పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త పడులా చెప్పారు. తుది పరీక్షలు ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాలో ఈ మందు అమ్మకాలు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ మందును మరికొంత అభివృద్ధి చేస్తే మనుషులకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుందని అంటున్నారు.