భారత్ లో బీమాకు అవీవా గుడ్‌బై?
న్యూఢిల్లీ: బ్రిటన్ ఆర్థిక సేవల దిగ్గజం అవీవా భారత బీమా మార్కెట్ నుంచి వైదొలగడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ సంస్థ డాబర్‌తో జాయింట్ వెంచర్‌ద్వారా పదేళ్లుగా అవీవా జీవిత బీమా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. జేవీలో అవీవా ఇండియా వాటా 26 శాతం. వాటాల అమ్మకానికి కొనుగోలుదారుని వెతికే ప్రక్రియలో భాగంగా కార్పొరేట్ సలహాదారులను నియమించుకునే పనిలో అవీవా ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
నో కామెంట్: ఈ వార్తలపై వ్యాఖ్య కోసం ఈ మెయిల్ ద్వారా సంప్రదించినప్పుడు, అవీవా ఇండియా ప్రతినిధి సమాధానమిస్తూ, ‘‘మార్కెట్ ఊహాగానాలు లేదా వదంతులపై మా విధానం ప్రకారం వ్యాఖ్యానించలేం’’ అని పేర్కొన్నారు. 2002లో ప్రారంభమైన జాయింట్ వెంచర్ పెయిడప్ క్యాపిటల్ రూ.2,004 కోట్లు. ఇందులో అవీవా వాటా 26 శాతం. 2011-12తో పోల్చితే, 2012-13లో అవీవా జీవిత బీమా కంపెనీల మొత్తం ప్రీమియం వసూళ్లు 11% క్షీణించి రూ. 2,140.6 కోట్లకు దిగింది. ఈ ఏడాది మొదట్లో నెదర్లాండ్స్‌కు చెందిన ఐఎన్‌జీ... ఇంగ్ వైశ్యా లైఫ్ కంపెనీలో తన 26% వాటాను యక్సైడ్‌కు విక్రయించాలని నిర్ణయించింది. గతేడాది అమెరికాకు చెందిన న్యూయార్క్ లైఫ్ కూడా భారత్ జాయింట్ వెంచర్ కంపెనీలో తన 26% వాటాను జపాన్‌కు చెందిన మిత్సూయీ సుమిటోమో బీమా కంపెనీకి విక్రయించింది. ఈ రంగంలో నెలకొన్న తీవ్ర పోటీ పరిస్థితుల నేపథ్యంలో ఈ రెండు కంపెనీల బాటన అవీవా నడుస్తుందన్న వార్తలు వస్తుండడం గమనార్హం.