న్యూఢిల్లీ: నాలుగు బ్యాంకులు తమ వడ్డీరేట్లలో మార్పులు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించాయి. వీటిలో యాక్సిస్, కరూర్ వైశ్యా, కెనరా, దేనా బ్యాంకులు ఉన్నాయి. ఆర్‌బీఐ అనుసరిస్తున్న కఠిన లిక్విడిటీ పరిస్థితుల నేపథ్యంలో పలు బ్యాంకులు ద్రవ్య లభ్యతను పెంచుకోవడంపై దృష్టి పెట్టాయి. ఇందుకనుగుణంగా డిపాజిట్ రేట్లు, రుణ రేట్లను పెంచుతున్నాయి.
యాక్సిస్...: ప్రైవేటు రంగంలో మూడవ అతిపెద్ద యాక్సిస్ బ్యాంక్ కనీస(బేస్) రుణ రేటును పావుశాతం పెంచింది. దీనితో ఈ రేటు 10.25%కు ఎగసింది. తాజా రేటు ఆగస్టు 19 నుంచీ అమల్లోకి వచ్చినట్లు బ్యాంక్ సోమవారం తెలిపింది. తాజా నిర్ణయంతో కనీస రేటుకు అనుసంధానమైన గృహ, ఆటో, కార్పొరేట్ రుణ రేట్లు పెరగనున్నాయి.
కెనరా బ్యాంక్ డిపాజిట్ రేట్లు పెంపు
ప్రభుత్వ రంగ కెనరాబ్యాంక్ కొన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను 1.75% వరకూ పెంచింది. కొత్త రేట్లు మంగళవారం నుంచీ అమల్లోకి వస్తాయి. దీనిప్రకారం 31-45 రోజలు మధ్య డిపాజిట్ రేటు 6.50 శాతం నుంచి 8.25 శాతానికి చేరింది. 46-90 రోజుల మధ్య డిపాజిట్ రేటు 7% నుంచి 8.30 శాతానికి చేరింది.
దేనా ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్ రేట్ అప్
దేనా బ్యాంక్ మూడేళ్లు పైబడిన ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లపై వడ్డీరేట్లను 1శాతం పెంచింది. అమెరికా డాలర్, పౌండ్, యూరో, జపాన్ యన్, కెనడా డాలర్, ఆస్ట్రేలియన్ డాలర్‌లో ఎన్‌ఆర్‌ఐల ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ బ్యాంక్ (ఎఫ్‌సీఎన్‌ఆర్-బీ) ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెరగనున్నట్లు బ్యాంక్ తెలిపింది.
కరూర్ వైశ్యా..
కాగా ప్రైవేటు రంగంలోని కరూర్ వైశ్యా బ్యాంక్ రుణ రేటును మంగళవారం నుంచీ పావుశాతం పెంచుతోంది. దీనితో ఈ రేటు 11 శాతానికి చేరనుంది. ప్రాథమిక వడ్డీరేటు (బీపీఎల్‌ఆర్)ను కూడా బ్యాంక్ 15.75 % నుంచి 16%కు పెంచింది.
4 బ్యాంకుల రుణ, డిపాజిట్ రేట్ల పెంపు
Published Tue, Aug 20 2013 2:31 AM | Last Updated on Fri, Sep 1 2017 9:55 PM
Advertisement