హైకోర్టును ఆశ్రయించిన మాజీ క్రికెటర్!
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్ష ఎన్నికల్లో తన నామినేషన్ ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ హైకోర్టును ఆశ్రయించారు. హెచ్‌సీఏ ఎన్నికల్లో అజారుద్దీన్ దరఖాస్తును రిటర్నింగ్ అధికారి కే రాజీవ్ రెడ్డి తిరస్కరించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంలో అజార్ పై బీసీసీఐ నిషేధం ఎత్తివేసిందా? లేదా? ఆయన హెచ్‌సీఏ ఓటరు అవునా? కాదా? అన్నది స్పష్టత లేకపోవడంతో ఆయన నామినేషన్ ను తిరస్కరించినట్టు తెలిపారు. అయితే, దీనిని తప్పుబడుతూ అజార్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
2000 సంవత్సరంలో భారత క్రికెట్ ను కుదిపేసిన మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో అజారుద్దీన్ ప్రమేయం ఉందంటూ ఆయనపై బీసీసీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇటీవల జస్టిస్ లోధా కమిటీ సిఫారసుల నేపథ్యంలో హెచ్‌సీఏ ప్రస్తుత అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ పదవి నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి పోటీపడాలని అజార్ నిర్ణయించారు. అయితే, ఆయన ఈ ఎన్నికల్లో పోటీకి ఎంతవరకు అర్హులన్నది తెలియకపోవడం వల్లే ఆయన నామినేషన్ తిరస్కరణకు గురయినదని ఆయూబ్ ఖాన్ అంటున్నారు.
ముగిసిన హెచ్సీఏ ఎన్నికలు
కాగా, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఎన్నికలు ముగిశాయి. మంగళవారం ఉప్పల్ స్టేడియంలో ఈ ఎన్నికలు జరిగాయి. మొత్తం 17 మంది అభ్యర్థులు పోటీపడగా.. అందులో జి వివేకానంద్, విద్యుత్ జైసింహాలు అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు.
ఈ ఎన్నికల్లో 218 మంది సభ్యులకు ఓటు హక్కు ఉంది. వివాదాల నడుమ ఎన్నికలు జరుగుతుండటంతో ఫలితాలపై ఆసక్తి నెలకొంది. వివాదాల నేపథ్యంలో హైకోర్టు తుది ఉత్తర్వులు వచ్చిన తర్వాతే ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు. బుధవారం మధ్యాహ్నం హైకోర్టు తీర్పు వచ్చే అవకాశముంది.