అడ్వాణీకి బిగుసుకుంటున్న ఉచ్చు!
లక్నో: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీపై లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం మరిన్ని అభియోగాలు నమోదు చేసే అవకాశం ఉంది. అడ్వాణీతోపాటు బీజేపీ నేతలు మురళీ మనోహర్‌జోషి, ఉమా భారతి తదితరులపై కూడా కొత్త అభియోగాలు నమోదు కావొచ్చు. బాబ్రీ కూల్చివేత అంశంలో వీరిపై ఉన్న నేరపూరిత కుట్ర ఆరోపణలను 2011లో అలహాబాద్ హైకోర్టు కొట్టివేయగా, సుప్రీంకోర్టు గత నెలలో పునరుద్ధరించడం తెలిసిందే.
ఏప్రిల్ 19న సీబీఐ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారిస్తూ... ఈ కేసులో వాదనలు ప్రతిరోజూ వినాలనీ, నెల రోజుల్లో విచారణ మొదలుపెట్టి, రెండేళ్లలోపు ముగించాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆదేశించింది. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 120–బి ప్రకారం అడ్వాణీ తదితరులపై కొత్తగా అభియోగాలు మోపొచ్చని సుప్రీంకోర్టు అప్పుడే చెప్పింది. మరోవైపు ఈ కేసులో ఆరో నిందితుడు, శివసేన మాజీ ఎంపీ సతీశ్ ప్రధాన్‌కు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం బెయిలు మంజూరు చేసింది.