
బాబు.. ఆంధ్రా డెంగ్!
చైనాలో మావోను తొలగించిన డెంగ్ వెన్నుపోటుదారుడా?
* తప్పనిసరి పరిస్థితుల్లోనే మావోపై తిరుగుబాటు చేశారు
* ఎన్టీఆర్, చంద్రబాబు ఉదంతం కూడా ఈ కోవలోనిదే
* చైనాలో డెంగ్‌ను, ఏపీలో బాబును ప్రజలు అభిమానిస్తున్నారు
* వెన్నుపోటుపై చరిత్రను వక్రీకరిస్తూ తెలుగుదేశం కార్యకర్తలకు శిక్షణ
సాక్షి, హైదరాబాద్: చైనా కమ్యూనిస్టు నేత మావో నాలుగో భార్య మాయలోపడి చైనా ప్రభుత్వానికి, అధికార కమ్యూనిస్టు పార్టీకి ప్రమాదకర పరిస్థితులు కల్పించినప్పుడు ఆయనను అధికారం నుంచి తొలగించారు...
అదే తరహాలో ఎన్టీఆర్‌ను సీఎం పదవి నుంచి తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు... ఇదీ టీడీపీ కార్యకర్తలకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాల్లో ప్రస్తుతం బోధిస్తున్న కొత్త పాఠం. టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ నాయకులకు వరు సగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా చిత్తూరు జిల్లా తిరుపతి, ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ కేంద్రాల్లో శుక్రవారం నుంచి శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి.
కందుకూరు శిక్షణ శిబిరాన్ని ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు లోకేశ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో శిక్షణాంశాలు పేరుతో శ్రేణులకు పుస్తకాలను పంపిణీ చేశారు. సొంత మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి గద్దెదింపి సీఎం పదవిని చేపట్టారన్న ముద్రనుంచి బయటపడటానికి బాబు పార్టీ శిక్షణ తరగతుల్లో అందించిన పుస్తకంలో కొత్తగా చేర్చిన అధ్యాయంలో చరిత్రను వక్రీకరించారు. శిక్షణాంశాల పేరుతో ప్రచురించిన 82 పేజీల పుస్తకంలో ‘1994లో విశేష ప్రజాదరణ’ పేరిట 7వ అధ్యాయంలో 1994 నాటి పరిణామాలను వివరించారు.
అందులో ఎన్టీఆర్‌ను గద్దెదించిన వైనాన్ని సమర్థించుకోవడానికి నానా తంటాలు పడ్డారు. ఎన్టీఆర్‌ను గద్దెదింపిన సంఘటనను ఏకంగా చైనాలో మావో ఘటనతో పోల్చారు. ‘‘చైనా ప్రజలు, చైనా కమ్యూనిస్టు పార్టీ మావోను అమితంగా అభిమానిస్తారు. అయితే ఆయన నాలుగో భార్య మాయలోపడి చైనా ప్రభుత్వానికి, అధికార కమ్యూనిస్టు పార్టీకి ప్రమాదకర పరిస్థితి కల్పించినప్పుడు మావోను అధికారం నుంచి తొలగించారు. ఇందులో కీలకపాత్ర పోషించిన డెంగ్ జియావో పింగ్ వెన్నుపోటుదారుడా? చైనా ప్రభుత్వ స్థాపకుడిగా మావోను, ఆధునిక చైనా నిర్మాతగా డెంగ్‌ను చైనా ప్రజలు నేటికీ ప్రేమిస్తున్నారు.
ఎన్టీఆర్, బాబు ఉదంతం కూడా ఈ కోవకు చెందిన ఒక చారిత్రక అని వార్య ఘటనగా చూడాలి’’ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి గద్దెదింపిన 20 ఏళ్ల తర్వాత దాన్ని సమర్థించుకోవడానికి చేసిన ఈ ప్రయత్నంపై పార్టీ శ్రేణుల్లో విస్మ యం వ్యక్తమవుతోంది. చైనాలో డెంగ్ వెన్నుపోటుదారుడైతేనే ఇక్కడ తనను కూడా వెన్నుపోటుదారుడిగా చూడాలని పరోక్షంగా అందులో చెప్పడం పార్టీ నేతలను విస్మయపరుస్తోంది. ‘‘ఎన్టీఆర్‌ను లోబరచుకొన్న ఒక దుష్టశక్తి చర్యలవల్ల పార్టీ దెబ్బతినే పరిస్థితి వచ్చింది. దాంతో ఆవేదనకు గురైన కార్యకర్తలు, నాయకులు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు చంద్రబాబును ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి పార్టీని, ప్రభుత్వాన్ని గట్టెక్కించాలని తీవ్ర ఒత్తిడి చేశారు.
వారి అభీష్టం మేరకు గుండెను రాయిచేసుకుని 1995లో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించారు’’ అని సమర్థించుకున్నారు. కానీ వాస్తవానికి మావో 1976లో మరణించేవరకూ అధికారంలోనే ఉన్నారు. ఆయన్నెవరూ అధికారం నుంచి తొలగించలేదు. సాంస్కృతిక విప్లవం సమయంలో తన విధానాలను వ్యతిరేకించినందుకు సన్నిహితుడైన డెంగ్‌ను జైల్లో పెట్టించారు. మావో మరణానంతరం రెండేళ్ల తర్వాత 1978లో డెంగ్ పార్టీ బాధ్యతలు చేపట్టారు. ఈ వాస్తవాలన్నీ వక్రీకరించి మావోను డెంగ్ అధికారం నుంచి తప్పించినట్లు రాయడంపై పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు.