నేడు కేంద్ర మంత్రులతో బాబు భేటీ
జపాన్ నుంచి ఢిల్లీ చేరుకున్న సీఎం
సాక్షి, న్యూఢిలీ/ హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాలుగురోజుల జపాన్ పర్యటన ముగించుకుని గురువారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. శుక్రవారం ఉదయం ఆయన ఇక్కడ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఉదయం 9.30 గంటలకు విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్, 11 గంటలకు అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, మధ్యాహ్నం 1.30కి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతితో ఆయన భేటీ అవుతారు.
కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతోనూ బాబు సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చించనున్నారు. అలాగే గోదావరి పుష్కరాలకు హాజరుకావాల్సిందిగా ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. ఇలావుండగా జపాన్ పర్యటన విజయవంతమైందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. అక్టోబర్‌లో రాజధాని శంకుస్థాపనకు జపాన్ ప్రధానిని సీఎం ప్రత్యేకంగా ఆహ్వానించారని మీడియాకు తెలిపారు.
కొమముర సంస్థ ప్రతినిధులతో కూడా
ఢిల్లీ బయలుదేరటానికి ముందు చంద్రబాబు టోక్యోలో కొమముర సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సంస్థ కెమెరాలతో పాటు లెన్స్‌లను తయారు చేస్తుంది. ఈ సంస్థ ఉత్పత్తి చేసే టెక్నికల్ కెమెరాలు, ప్రో డిజిటల్ ఫొటో, ప్రో బ్రాడ్ కాస్టింగ్ పరికరాలు విపత్తుల నివారణకు తోడ్పడతాయి. ఈ భేటీలో పాల్గొన్న సంస్థ చైర్మన్ టొషియుకి భారత్‌లో లెన్స్‌లు, కెమెరాల ఉత్పత్తిపై తాము ఆసక్తితో ఉన్నామని తెలిపారు.