అరటి పండు యుద్ధం | Banana War History | Sakshi
Sakshi News home page

అరటి పండు యుద్ధం

Published Fri, Sep 11 2015 10:45 AM | Last Updated on Sun, Sep 3 2017 9:12 AM

అరటి పండు యుద్ధం

అరటి పండు యుద్ధం

సాక్షి: బనానా (అరటి పండు) అంటే ఇష్టపడని వారు ఉండరు. మన దేశంలోనే కాదు.. ప్రపంచంలోని అనేక దేశాల్లో అరటి పండ్లను విరివిగా వినియోగిస్తారు. ఎన్నో పోషకాలు కలది కాబట్టి అరటి పండ్లకు డిమాండ్ ఎక్కువే. అమెరికా,  ఐరోపాలాంటి అగ్ర దేశాల్లో సైతం అరటి పండ్లను విపరీతంగా ఇష్టపడతారు. అంతర్జాతీయంగా భారీ స్థాయిలో అరటి పండ్ల వ్యాపారం సాగుతోంది.

ఒకప్పుడు అనేక దేశాలు ఆర్థిక ప్రగతికి అరటి పండ్ల ఎగుమతి మీదే ఆధారడపడేవి. పలు దేశాల ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన అరటి పండ్లే రెండు అగ్ర దేశాల మధ్య వ్యాపార సంక్షోభానికి కారణమయ్యాయంటే నమ్ముతారా? పైగా అది ప్రపంచంలోనే అతి సుదీర్ఘ వ్యాపార సంక్షోభం. దీనికి విశ్లేషకులు పెట్టిన పేరు ‘బనానా వార్’. ప్రపంచ చరిత్రలో ఓ ప్రత్యేక స్థానం సంపాదించిన ‘బనానా వార్’ విశేషాలు తెలుసుకుందాం..

ప్రారంభం..
రెండో ప్రపంచ యుద్దం ముగిసిన తర్వాత ‘బనానా వార్’ మెల్లగా ప్రారంభమైంది. రెండు అగ్ర రాజ్యాలైన యూరోపియన్ యూనియన్, లాటిన్ అమెరికాల మధ్య తలెత్తిన వ్యాపార సంక్షోభమే ‘బనానా వార్’. 1950, 60వ దశకానికి ముందు అనేక ఆఫ్రికా, కరీబియన్, పసిఫిక్ దేశాలు (ఏసీపీ దేశాలు) యూరోపియన్ యూనియన్‌కు వలస రాజ్యాలుగా ఉండేవి. 1960వ దశకానికి వచ్చే సరికి అవన్నీ స్వతంత్ర దేశాలుగా మారాయి. ఈ దశలో తమ మాజీ వలస రాజ్యాలైన ఏసీపీ దేశాలతో వ్యాపార సంబంధాలను బలపరచుకోవాలని యూరోపియన్ యూనియన్ దేశాలు భావించాయి. దీంతో ఆయా దేశాలతో పన్నులు లేని వ్యాపార ఒప్పందాలకు తెరతీశాయి.

ఈఈసీ ఏర్పాటు..
యూరోపియన్ యూనియన్(ఈయూ) లోని ఆరు దేశాలతోపాటు, ఏసీపీ దేశాలు కలిసి స్వేచ్ఛా వాణిజ్యం చేసుకునే ఉద్దేశంతో యూరోపియన్ ఎకనమిక్ కమ్యూనిటీ (ఈఈసీ)గా ఏర్పడ్డాయి. అనంతరం 1973లో బ్రిటన్, ఐర్లాండ్, డెన్మార్క్ దేశాలు కూడా ఈఈసీలో చేరాయి. దీంతో మొత్తం ఈఈసీలో తొమ్మిది ఐరోపా దేశాలు, దాదాపు 50 వరకు వలస దేశాలు చేరాయి.

వీరు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈఈసీ దేశాల మధ్య పన్నులు లేకుండా వ్యాపార కార్యకలాపాలు సాగాలి. ముఖ్యంగా ఏసీపీ దేశాలకు అగ్ర రాజ్యాలైన ఐరోపా దేశాల్లో స్వేచ్ఛా వాణిజ్యం చేసుకునే వెసలుబాటు కల్పించాలి. దీని వల్ల అప్పుడే స్వతంత్రం పొందిన ఆయా దేశాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వీలుంటుందనేది వారి ఉద్దేశం. ఆర్థిక తోడ్పాటును అందించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడం కూడా ఇందులోని లక్ష్యాలు.

అరటి పండ్లే ప్రధాన వనరు...
పన్నులు తక్కువగా ఉండేలా వాణిజ్య ఒప్పందం కుదరడంతో ఈఈసీ దేశాల మధ్య వ్యాపార కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఇందులో ఏసీపీ దేశాల నుంచి ఐరోపా దేశాలకు అధికంగా దిగుమతి అయ్యే పంట అరటి పండ్లే. ఏసీపీ దేశాల్లో అరటి పండ్లు ఎక్కువగా పండడంతో వాటినే అధికంగా ఎగుమతి చేసేవారు. ఆ దేశాల ఆర్థికాభివృద్ధికి తోడ్పడిన వాణిజ్య ఎగుమతులు కూడా అరటిపండ్లే. ఒప్పందం ప్రకారం ఐరోపా దేశాలు ఏసీపీ దేశాల నుంచి దిగుమతి చేసుకునే అరటి పండ్లపై పన్నులు విధించేవారు కాదు. కానీ లాటిన్ అమెరికా దేశాల నుంచి వచ్చే అరటి పండ్ల దిగుమతిపై మాత్రం భారీ స్థాయిలో పన్నులు విధించేవారు. ఏసీపీ దేశాల నుంచి వచ్చే అరటి పండ్ల దిగుమతిపై పన్నులు విధించకుండా, అమెరికా దిగుమతులపైనే ఈయూ పన్నులు విధించడంతో రెండు రాజ్యాల మధ్య వ్యాపార సంక్షోభం తలెత్తింది.

నష్టపోయిన అమెరికా..
ఈ విధానంతో లాటిన్ అమెరికా దేశాలు భారీగా నష్టపోయాయి. నిజానికి కరీబియన్ దేశాలతో పోలిస్తే అమెరికాలో అరటిపండ్లు ఎక్కువగా పండుతాయి. ఇక్కడ వాటి సాగు వ్యయం కూడా తక్కువే. దీని వల్ల అక్కడ అధికంగా ఉత్పత్తయ్యే అరటి పండ్లు ఐరోపాకు దిగుమతి అయ్యేవి. అయితే ఈఈసీ ఏర్పాటుతో ఐరోపా దేశాలు అమెరికా నుంచి బనానా దిగుమతుల్ని తగ్గించి, ఏసీపీ దేశాల నుంచి దిగుమతులు పెంచుకున్నాయి. ఫలితంగా అమెరికా కంపెనీలు నష్టపోయాయి. పైగా వారి ఎగుమతులపై పన్నులు విధించడంతో ఆ నష్టం మరింత పెరిగింది. అందులోనూ అమెరికాలో ప్రధానంగా ఐదే కంపెనీలే అరటిపండ్లను ఉత్పత్తి చేసేవి. పై చర్యలతో ఆ కంపెనీలు నష్టాలు చవిచూడాల్సి వచ్చింది.

ప్రతిచర్యలు-పరిష్కారం..
అరటి దిగుమతుల విషయంలో ఈయూ అనుసరిస్తున్న ద్వంద్వ వాణిజ్య విధానాన్ని అమెరికా వ్యతిరేకించింది. ఇలా రెండు అగ్రదేశాల మధ్య 1970వ దశకంలో మొదలైన అరటి పండ్ల వాణిజ్య వివాదం దశాబ్దాలపాటు కొనసాగింది. ఈయూ విధానాలకు నిరసనగా అమెరికా కూడా ఐరోపా దేశాల దిగుమతులపై అధిక పన్నులు, కొన్నింటిపై వంద శాతం పన్ను కూడా విధించింది. ఈ వివాదంపై చాలా కాలంపాటు అమెరికా, ఐరోపాల మధ్య చర్చలు కొనసాగినా అంతగా ఫలితాల్నివ్వలేదు. దీంతో ఈయూ విధానాలపై అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్థ (వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్)కు ఫిర్యాదు చేసింది.

అయితే సుదీర్ఘకాలం పాటు సాగిన వాదనలు, చర్చల అనంతరం ఈయూ, లాటిన్ అమెరికాల మధ్య వాణిజ్యానికి సంబంధించిన ఒప్పందం కుదిరింది. అధిక పన్నులు విధించినందుకు గానూ ఈయూ నుంచి అమెరికా సంస్థలు నష్టపరిహారాన్ని పొందాయి. 1970ల్లో  మొదలైన ఈ సంక్షోభానికి దాదాపు 20 ఏళ్ల తర్వాత 1990వ దశకంలో తెరపడింది. అలా ప్రపంచంలో అత్యధిక కాలం కొనసాగిన వాణిజ్య సంక్షోభంగా ‘బనానా వార్’ నిలిచింది. అయితే ఇప్పటికీ ఈ ఒప్పందంలో పలు మార్పులు జరుగుతూనే ఉన్నాయి.

అతిపెద్ద మార్కెట్..
ప్రపంచంలో అరటి పండ్లకు అతిపెద్ద మార్కెట్‌గా ఐరోపా దేశాలు నిలిచాయి. ప్రతి ఏటా దాదాపు 55 లక్షల టన్నుల అరటి పండ్లను ఈయూ దిగుమతి చేసుకుంటుంది. అరటి పండ్లను ఉత్పత్తి చేసే దేశాల్లో ఇండియా, బ్రెజిల్‌లు కూడా ఉన్నాయి. అయితే ఈ దేశాల్లో వీటికి స్థానికంగానే మంచి డిమాండ్ ఉండడంతో ఎక్కువగా ఇక్కడే వినియోగమవుతున్నాయి. విదేశాలకు ఎగుమతి చేసేది తక్కువ శాతమే. కానీ సెంట్రల్ అమెరికా, కరీబియన్ దేశాల్లో ఉత్పత్తి అధికంగానే ఉన్నా వాటిని విదేశాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement