మోదీ ప్రతిష్టను చూసి ఓర్వలేకపోతోంది
కాంగ్రెస్ పార్టీపై దత్తాత్రేయ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ప్రతిష్టను చూసి కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకపోతున్నదని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. పార్టీ నేతలు చింతల రామచంద్రారెడ్డి, ప్రకాశ్ రెడ్డి, ప్రదీప్‌కుమార్‌తో కలసి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పొరుగుదేశాలతో వీలైనంత స్నేహపూర్వకంగా ఉంటే దేశంలో అంతర్గత భద్రత, అభివృద్ధి బాగుంటుందన్నారు. గతంలో ప్రధానులుగా పనిచేసిన వాజ్‌పేయి, మన్మోహన్‌సింగ్ వంటివారు ఇదే ఆశించారని గుర్తుచేశారు.
పాకిస్తాన్‌కు ప్రధాని మోదీ వెళ్లడాన్ని ప్రపంచం అంతా అభినందిస్తున్నదన్నారు. దేశంలోని రాజకీయపార్టీలతో పాటు అన్నిరంగాల మేధావులు, ప్రజాస్వామ్యవాదులు పాకిస్తాన్‌కు మోదీ వెళ్లడాన్ని స్వాగతిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి మోదీ వ్యతిరేక ఫోబియా పట్టుకుందన్నారు. స్వార్థ, రాజకీయ ప్రయోజనాలను ఆశించకుండా దేశ ప్రజల విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలని సూచించారు.
తీవ్రవాద సంస్థల్లో శిక్షణ పొందడానికి హైదరాబాద్ యువకులు వెళ్తున్నారనే విషయం తీవ్రమైన ఆందోళనను కలిగించే అంశమన్నారు. ప్రపంచ ప్రజల సుఖశాంతులను కోరాల్సిన యువత.. అమాయకత్వం, ఆకర్షణతో తప్పుదోవ పట్టడం బాధాకరమన్నారు. ఉగ్రవాదాన్ని నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్రస్థాయిలో ప్రత్యేక డీజీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా విభాగాన్ని ఏర్పాటు చేయాలని దత్తాత్రేయ కోరారు. అంతర్గత శాంతిభద్రతల పరిరక్షణ కోసం రాజకీయ పార్టీలకతీతంగా అంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలపై నేషనల్ హెరాల్డ్ కేసుకు బీజేపీకి సంబంధం లేదన్నారు.