ఐటీ సిటీలో ఇక నీళ్లకు రేషన్ తప్పదు!
దేశంలోనే ఐటీకి అతిపెద్ద కేంద్రంగా పేరొందిన బెంగళూరు నగరం ప్రస్తుతం నీటి కొరతతో కటకటలాడుతోంది. ఇప్పటికే అక్కడి రిజర్వాయర్లలో నీటిమట‌్టాలు గణనీయంగా తగ్గిపోయాయి. దాంతో బెంగళూరు సహా చుట్టుపక్కల పట్టణాల్లో త్వరలోనే నీళ్లకు రేషన్ విధానాన్ని అమలుచేసే అవకాశం కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నగరానికి నిరంతరాయంగా నీటి సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన 15 రోజులకే ఈ పరిస్థితి ఏర్పడటం గమనార్హం. బెంగళూరు నగరంతో పాటు ఇతర పట్టణాలు కూడా కావేరీ జలాల మీదే ఆధారపడుతున్నాయి. ఇప్పటికే ఆ నదిలో నీటిమట్టం తగ్గిపోవడంతో నీటి ప్రెషర్ తగ్గిపోతోందని, కాలుష్యం కూడా పెరుగుతోందని అంటున్నారు.
మామూలు రోజుల్లో అయితే తెల్లవారుజామున 5.30 నుంచి మూడు గంటల పాటు నీళ్లు సరఫరా చేస్తారు. కానీ ఇప్పుడు ప్రెషర్ తక్కువ ఉండటంతో రెండు గంటలే ఇస్తున్నారు. దాంతో డిస్ట్రిబ్యూషన్ లైన్లకు చివర్లో ఉన్న వినియోగదారులకు తగినంతగా నీళ్లు అందడం లేదు. సరఫరా చేస్తున్న నీళ్లు కూడా చాలా మురిగ్గా ఉంటున్నాయని హెబ్బల్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కేవీ జగదీష్ అన్నారు. బెంగళూరు వాటర్ బోర్డు అనధికారికంగా నీళ్ల రేషనింగ్ మొదలుపెట్టిందని అంటున్నారు.
నగరంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో నీళ్లకు డిమాండ్ పెరిగిందని, దానికితోడు బోర్‌వెల్స్ కూడా ఫెయిల్ కావడంతో కావేరీ జలాల మీదే ఎక్కువగా ఆధారపడుతున్నారని.. కానీ ఆ నదిలో నీళ్లు తగ్గడంతో ప్రెషర్ కూడా తక్కువైందని వాటర్ బోర్డు చైర్మన్ తుషార్ గిరినాథ్ చెప్పారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో తాము రోజుకు 1300, 1350 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నామని, ప్రస్తుతానికి నగర అవసరాలకు తగినంతగా నీళ్లున్నాయని ఆయన అన్నారు. ఎక్కువగా బోర్ వెల్స్ మీద ఆధారపడిన ప్రాంతాలకు తాము నీళ్లు ఎక్కువ పంపుతున్నామని, అవసరమైన దాని కంటే ఎక్కువ నీళ్లు వెళ్తున్న ప్రాంతాలకు తగ్గించామని వివరించారు. అయితే.. రాబోయే రోజుల్లో మాత్రం నీటి సరఫరా బాగా తగ్గుతుందని వాటర్ బోర్డు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.