పాపం.. బ్యూటీ క్వీన్ ప్రాణం తీసిన కాస్మోటిక్ సర్జరీ
రియో డి జెనీరో: బ్రెజిల్‌కు చెందిన మాజీ బ్యూటీ క్వీన్ రక్వెల్ శాంటోస్ (28)కు కాస్మోటిక్ సర్జరీ ప్రాణం తీసింది. నవ్వినప్పుడు ముఖంపై పడే ముడతలను తొలగించుకునేందుకు రక్వెల్.. రియో డి జెనీరో సమీపంలోని నిటెరోయ్‌లో ఓ క్లినిక్‌లో కాస్మోటిక్ సర్జరీ చేయించుకుంది. సర్జరీ చేయించుకున్న కాసేపటికే ఆమెకు గుండెపోటు రావడంతో మరణించింది. రక్వెల్ బాయ్‌ఫ్రెండ్ గిల్బెర్టో అజెవెడో ఈ విషయాన్ని వెల్లడించాడు.
బ్రెజిల్ అందాల పోటీల్లో రక్వెల్ రన్నరప్‌గా నిలిచింది. మోడల్‌గా పనిచేస్తోంది. ముఖంపై ముడతల పడటం, గ్లామర్ తగ్గడంతో ఆమె ప్రత్యేక చర్యలు తీసుకునేది. ఆమె తరచూ పొటినే అనే స్టెరాయిడ్‌ను ఇంజెక్షన్ ద్వారా తీసుకునేది. కాగా దీన్ని ఎక్కువగా బాడీబిల్డర్లు వాడతారు. ఈ స్టెరాయిడ్‌ను వాడటం వల్ల బీపీ లెవెల్ ప్రమాదకర స్థాయికి పెరుగుతుంది. రక్వెల్ సిగరెట్లు తాగడంతో పాటు గ్లామర్ కోసం డ్రగ్స్ తీసుకునేదని గిల్బెర్టో చెప్పాడు. దీనికి తోడు రక్వెల్ అందాన్ని మెరుగులు దిద్దుకునేందుకు తరచూ సర్జరీలు చేయించుకునేంది. ఇది ప్రమాదకరమని కుటుంబ సభ్యులు హెచ్చరించినా వినలేదు. గతంలో ముక్కు, చుబుకం, బుగ్గల ఆకృతి మెరుగుపరుచుకునేందుకు సర్జరీ చేయించుకుంది. చివరకు సర్జరీ పిచ్చే ఆమె ప్రాణం తీసింది.