Alla Dakshayani: దిద్దుబాటు | Alla Dakshayani: Ramkey Foundation Free Mega Plastic Surgery Camp | Sakshi
Sakshi News home page

Alla Dakshayani: చెదిరిన రూపురేఖలకు కాంతిరేఖలు

Published Wed, Jan 17 2024 12:36 AM | Last Updated on Wed, Jan 17 2024 12:36 AM

Alla Dakshayani: Ramkey Foundation Free Mega Plastic Surgery Camp - Sakshi

జీవితంలో దిద్దుబాటు చాలా అవసరం. అక్షరాలను దిద్దుకుంటాం. నడవడిక దిద్దుకుంటాం. మాటను దిద్దుకుంటాం... చేతను దిద్దుకుంటాం.

ఇన్నింటిని దిద్దుకోవడం వచ్చిన వాళ్లం... చెదిరిన రూపురేఖల్ని దిద్దుకోలేమా? కాంతి రేఖల కొత్త పొద్దుల్ని చూడలేమా? సూర్యుడు కర్కాటకం నుంచి మకరానికి మారినట్లే...

క్లెఫ్ట్‌ లిప్, క్లెఫ్ట్‌ పాలేట్‌తో పుట్టిన పిల్లలు కూడా మామూలు పిల్లల్లా బతికి బట్టకట్టాలి కదా! అగ్నిప్రమాదానికి గురైన వాళ్లు ముడతలు పడిన చర్మంతో బతుకు సాగించాల్సిన దుస్థితి ఎందుకు? ప్రమాదవశాత్తూ ఎముకలు విరిగి ముఖం రూపురేఖలు మారిపోతే... ఇక జీవితమంతా అద్దంలో ముఖం చూసుకోవడానికి భయపడాల్సిందేనా? వీటన్నింటికీ వైద్యరంగం పరిష్కరిస్తుంది.

అయితే ఆ వైద్యం సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉంటుంది. ఖర్చుపరంగా ఆకాశమంత ఎత్తులో ఉన్న వైద్యప్రక్రియను అవనికి దించాలంటే పెద్ద మనసు ఉండాలి. అలాంటి సమష్టి కృషిని సమన్వయం చేస్తున్నారు ఆళ్ల దాక్షాయణి. బాధితుల జీవితాల్లో కాంతిరేఖలను ప్రసరింపచేయడానికి ఏటా జనవరి నెలలో ఫ్రీ మెగా ప్లాస్టిక్‌ సర్జరీ క్యాంప్‌ నిర్వహిన్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో పంచుకున్న వివరాలివి.

‘‘ఒకప్పుడు గ్రహణం మొర్రి కేసుల గురించి తరచూ వినేవాళ్లం. కాలక్రమేణా సమాజంలో చైతన్యం పెరిగింది. గర్భస్థ దశలోనే గుర్తించి, పుట్టిన వెంటనే సర్జరీలు చేసి సరి చేసుకునే విధంగా వైద్యరంగం కూడా అభివృద్ధి చెందింది. అయినప్పటికీ మారుమూల గ్రామాల్లో గ్రహణం మొర్రి బాధితులున్నారు. వాళ్లు ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకునే స్థోమత లేని తల్లిదండ్రులు పిల్లల వైకల్యాన్ని సరిచేయలేకపోతున్నారు.

ఒక బిడ్డ ఆర్థిక కారణాలతో వైకల్యాన్ని భరించాల్సిన దుస్థితి రావడం దారుణమైన విషయం. అలాగే ఇటీవల అగ్ని ప్రమాద బాధితులు, యాసిడ్‌ దాడి బాధితులు కూడా పెరుగుతున్నారు. వీటికితోడు వాహన ప్రమాదాల కారణంగా వైకల్యాలు కూడా పెరుగుతున్నాయి. ఈ సమస్యల నుంచి ఆర్థిక వెసులుబాటు ఉన్న వాళ్లు బయటపడగలుగుతున్నారు. ఖరీదైన వైద్యం చేయించుకోలేని వాళ్లు బాధితులుగా మిగిలిపోతున్నారు. అలాంటి వాళ్ల కోసం ఫ్రీ మెగా ప్లాస్టిక్‌ సర్జరీ క్యాంప్‌ బాధ్యత చేపట్టాం. నిజానికి ఈ సర్వీస్‌ మొదలై ఇరవై ఏళ్లు దాటింది.

► ఇద్దరు వైద్యుల చొరవ
రెండు వేల సంవత్సరంలో మొదలైన ఈ కార్యక్రమం కోవిడ్‌ రెండేళ్లు మినహా ఏటా జరుగుతోంది. డాక్టర్‌ భవానీ ప్రసాద్‌ అనస్థీషియనిస్ట్, డాక్టర్‌ సుదర్శన్‌ రెడ్డి ప్లాస్టిక్‌ సర్జన్‌. వీళ్ల ఆలోచనతోనే ఈ సర్వీస్‌ మొదలైంది. మొదటి ఏడాది హైదరాబాద్‌లోని మహావీర్, మెడ్విన్‌ హాస్పిటళ్లలో సర్జరీలు నిర్వహించారు. ఆ తర్వాత కిమ్స్, కామినేని హాస్పిటళ్లు సపోర్టు చేశాయి. నార్కెట్‌ పల్లి, నిజామాబాద్, శ్రీకాకుళంలో క్యాంపులు నిర్వహించారు. గత ఏడాది హైదరాబాద్, సీతారామ్‌బాగ్‌లో డాక్టర్‌ ఈశ్వర్‌ చందర్‌ చారిటబుల్‌ హాస్పిటల్‌ను వేదిక చేసుకున్నాం. ఇందుకోసం హాస్పిటల్‌ వాళ్లు రెండు ఆపరేషన్‌ థియేటర్‌లతో హాస్పిటల్‌ను సిద్ధం చేశారు.

యూఎస్‌లో స్థిరపడిన ఈ డాక్టర్లు ఏటా 45 రోజులు ఇండియాలో ఉండేటట్లు ప్లాన్‌ చేసుకున్నారు. అందులో కొంత సమయం ఈ సర్వీస్‌కి కేటాయిస్తున్నారు. యూఎస్‌లోని మెర్సీ మిషన్‌ వేదికగా వారందిస్తున్న సర్వీస్‌కి హైదరాబాద్‌లో ‘లయన్స్‌ క్లబ్‌ – గ్రీన్‌ల్యాండ్స్‌’ సహకారం అందిస్తోంది. రెండేళ్లుగా మా రాంకీ ఫౌండేషన్‌ కూడా బాధ్యతలు తీసుకుంది. ఇందుకోసం ఫౌండేషన్‌ ట్రస్టీగా నేను బోర్డు మెంబర్స్‌ నుంచి అనుమతి తీసుకుని ఈ కార్యక్రమాలను చేపట్టాను. ఈ ఏడాది ఇప్పటివరకు నమోదైన వాళ్లలో రాయలసీమ జిల్లాలు, నల్గొండ జిల్లా వాళ్లు ఎక్కువగా ఉన్నారు. మా ఈ సర్వీస్‌కి ప్రాంత, భాష, ఆర్థికపరమైన ఆంక్షలు ఏమీ లేవు. పేరు నమోదు చేసుకుని వచ్చి వైద్యం చేయించుకోవడమే.

► ఇది సమష్టి దిద్దుబాటు
ఈ సర్వీస్‌ కోసం ఇద్దరు డాక్టర్లు అమెరికా నుంచి వస్తారు. మరికొంతమంది డాక్టర్లు, ఇతర వైద్యసిబ్బంది మొత్తం ముప్పైమంది స్థానికులు ఈ సర్వీస్‌లో పాల్గొంటారు. ఈ హెల్త్‌ సర్వీస్‌ను రెండు దశాబ్దాలుగా విజయవంతంగా నిర్వహించడంలో పరవస్తు క్రియేటివ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు మధుకర్‌ స్వామి, లయన్స్‌ క్లబ్‌ విద్యాభూషణ్‌ సేవలు విశేషమైనవి. క్లెఫ్ట్‌ లిప్, క్లెఫ్ట్‌ పాలెట్, కాలి ముడుచుకుపోయిన చర్మం, జన్యుపరమైన వైకల్యాలను సరిచేయడం, ప్రమాదవశాత్తూ దవడ, ముక్కు, కాళ్లు, చేతులు విరిగిపోవడం వంటి సమస్యల్లో ప్లాస్టిక్‌ సర్జరీ ద్వారా సరిదిద్దగలిగిన అన్ని సమస్యలకూ వైద్యం అందిస్తున్నాం. కాస్మటిక్‌ సర్జరీలు ఈ క్యాంప్‌లో చేపట్టడం లేదు. మా సర్వీస్‌ గురించి వాల్‌పోస్టర్‌లు, బ్యానర్‌లతో జిల్లాల్లో ప్రచారం కల్పించాం. వీలైనంత ఎక్కువమంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేది నా ఆకాంక్ష’’ అన్నారు దాక్షాయణి.

ముఖం మీద ఒత్తైన జుత్తు
హయతి అనే ఎనిమిదేళ్ల పాపాయి సమస్య మరీ ప్రత్యేకం. హైపర్‌ ట్రైకోసిస్‌... అంటే జుత్తు తల వరకే పరిమితం కాకుండా ముఖం మీదకు పాకుతుంది. తలమీద ఉన్నంత దట్టమైన జుత్తు ఒక చెంప మొత్తం ఉంది. ఆ పాపకు నలుగురిలోకి వెళ్లాలంటే బిడియం. స్కూలుకెళ్లాలంటే భయం. ఆమె సమస్య అంటువ్యాధి కాదని టీచర్లకు తెలిసినప్పటికీ క్లాసులో మిగిలిన పిల్లలతో కలిపి కూర్చోబెడితే వాళ్ల పేరెంట్స్‌ నుంచి కంప్లయింట్స్‌ వస్తాయి కాబట్టి హయతిని విడిగా కూర్చోబెట్టేవారు. తరగతి గది, ఇంటి నాలుగ్గోడలు తప్ప మరే ప్రపంచమూ తెలియని స్థితిలో రోజులు గడుస్తున్న హయతి ప్లాస్టిక్‌ సర్జరీ ద్వారా మామూలైంది.

ఫ్రీ మెగా ప్లాస్టిక్‌ సర్జరీ క్యాంప్‌
మెర్సీ మిషన్స్‌∙యూఎస్‌ఏ, సేవా భారతి, లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌– గ్రీన్‌ ల్యాండ్స్, రాంకీ ఫౌండేషన్‌లు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఫ్రీ మెగా ప్లాస్టిక్‌ సర్జరీ క్యాంప్‌లో ఈ నెల 18వ తేదీ నుంచి స్క్రీనింగ్‌ జరుగుతుంది. సర్జరీలు 22వ తేదీ నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జరుగుతాయి. ఉచితవైద్యంతోపాటు మందులు, ఆహారం, బస సౌకర్యాలను కూడా కల్పిస్తున్నాం. పేషెంట్‌ పరిస్థితిని బట్టి కొందరికి సర్జరీ తర్వాత ఫాలోఅప్‌ కోసం మూడు నుంచి నాలుగు రోజులు బస చేయాల్సి రావచ్చు. గడిచిన డిసెంబర్‌ 20 నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొదలైంది. వైద్యసహాయం అవసరమైన వాళ్లు 78160 79234, 98482 41640 నంబర్లకు ఫోన్‌ చేసి పేరు నమోదు చేసుకోవాలి.
హైదరాబాద్, ఓల్డ్‌ మల్లేపల్లి, సీతారామ్‌బాగ్‌లోని డాక్టర్‌ ఈశ్వర్‌ చందర్‌ చారిటబుల్‌ హాస్పిటల్‌లో వైద్యసహాయం అందిస్తున్నాం.
– ఆళ్ల దాక్షాయణి, మేనేజింగ్‌ ట్రస్టీ, రామ్‌కీ ఫౌండేషన్‌

 – వాకా మంజులారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement