భూమిలోకి కుంగిపోతున్న బీజింగ్
బీజింగ్: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ముద్రపడిన చైనా రాజధాని బీజింగ్‌కు మరో ప్రమాదకరమైన పర్యావరణ ముప్పు పొంచి ఉంది. ఏడాదికి నాలుగు అంగుళాల చొప్పున ఈ నగరం భూమిలోకి కుంగిపోతోంది. పర్యావరణ పరిస్థితుల పట్ల ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వం నిర్లక్ష్యం ఇలాగే కొనసాగినట్లయితే మూడు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన బీజింగ్ ఓ నాటికి భూగర్భంలో కలసిపోతుంది. ఎత్తైన భవనాల నిర్మాణాలకు పోటీ పడడం, భూగర్భ జలాలను అతిగా వినియోగించడం వల్ల ఈ పరిస్థితులు తలెత్తాయని నిపుణులు చెబుతున్నారు.
బీజింగ్‌లోని పలు ప్రాంతాలు ఏడాదికి నాలుగు అంగుళాలు అంటే, 11 సెంటీ మీటర్లు భూమిలోకి కుంగిపోతుండగా, నగరంలోని తూర్పు ప్రాంతం మాత్రం ఏడాదికి వంద సెంటీమీటర్ల వరకు కుంగిపోతోందని, గత 80 ఏళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతోందని నిపుణులు అంచనా వేశారు. ఎత్తైన భవనాలను నిర్మించడం, భూగర్భ జలాలను ఇష్టానుసారం వాడడంతోపాటు భూపొరల మందం, మట్టి లక్షణాల కారణంగా తూర్పు ప్రాంతంలో కుంగడం ఎక్కువగా ఉందని వారు అభిప్రాయపడ్డారు.
2003 నుంచి 2010 మధ్య ఉపగ్రహాల ద్వారా సేకరించిన హై రెజల్యూషన్ చిత్రాలను అధ్యయనం చేయడం ద్వారా బీజింగ్‌లోని క్యాపిటల్ నార్మల్ యూనివర్శిటీ నిపుణులు ఈ విషయాలను కనుగొన్నారు. ఉత్తర చైనా మైదాన ప్రాంతానికి చివరలోవున్న బీజింగ్ నగరం భూపొరల్లో ఎల్లోనది ఉప నదుల ద్వారా వచ్చి చేరిన మేటలు ఉన్నాయి. ఇవి మెత్తగా ఉండడమే కాకుండా భూఅంతర్భాగంలో నీటి నిల్వలు అతి వేగంగా తరగిపోవడంతో భూమి ఎక్కువగా కుంగిపోతోందని నిపుణులు అధ్యయనంలో అంచనా వేశారు.