మరింత రెచ్చిపోతున్న చైనా
- దక్షిణ చైనా సముద్రంలో కొంతభాగం మూసివేత..
వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంపై గుండుగుత్తగా తన ఆధిపత్యం చాటాలని భావిస్తున్న చైనా మరో ముందడుగు వేసింది. సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు ఈ సముద్రంలో కొంత భాగాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. దక్షిణ చైనా సముద్రంపై చైనాకు ఎలాంటి హక్కులు లేవని అంతర్జాతీయ ట్రిబ్యునల్ తీర్పు వెలువరించిన కొద్దిరోజుల్లోనే చైనా ఈ చర్యకు దిగడం గమనార్హం.
సముద్రంలోని ఆగ్నేయ దీవి ప్రావిన్స్‌లో సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు సోమవారం నుంచి గురువారం ఈ ప్రాంతాన్ని మూసివేస్తున్నట్టు చైనాకు చెందిన హైనాన్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. అయితే, ఇవి ఏరకమైన సైనిక కార్యక్రమాలు అనేది వివరించలేదు. చైనా నేవీగానీ, రక్షణశాఖగానీ దీనిపై స్పందించలేదు.
దక్షిణా చైనా సముద్రంపై వివాదాన్ని సామరస్య ధోరణిలో పరిష్కరించేందుకు, రెండు దేశాల ఆర్మీల మధ్య సంప్రదింపులను పెంచేందుకు అమెరికా నేవీ టాప్ అడ్మిరల్ చైనాలో పర్యటిస్తున్న నేపథ్యంలోనే డ్రాగన్ ఈ చర్యకు దిగడం గమనార్హం. అపార వనరులు, సహజ సంపదకు నెలవైన దక్షిణా చైనా సముద్రంలో చైనాకు ఎలాంటి చారిత్రక హక్కులు లేవని హేగ్ లోని అంతర్జాతీయ ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ.. ఈ ఉత్తర్వులు బేఖాతరు చేస్తూ చైనా తన ధిక్కార ధోరణిని చాటుతున్న సంగతి తెలిసిందే.