ఈ పెంపుడు కుక్కలపై నిషేధం
బెంగళూరు: నగరంలోని అపార్ట్‌మెంట్లలో పొడవాటి బ్రీడింగ్ కుక్కల పెంపకాన్ని నిషేధించాలని బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. గ్రేట్ డేన్, ఇంగ్లీష్ మస్తిఫ్, బుల్‌డాగ్, బాక్సర్, రాట్‌వీలర్, సెయింట్ బెర్నార్డ్, జర్మన్ షెపర్డ్, గోల్డెన్ రిట్రీవర్ బ్రీడింగ్ కుక్కలను పెంపుడు కుక్కల జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఇతర జాతులకు చెందిన కుక్కలను మాత్రం ఒక్కో ఫ్లాట్‌కు ఒక్క కుక్క పెంపకాన్ని మాత్రమే పరిమితం చేయాలని కూడా నిర్ణయించింది.
ప్రతి కుక్కకు లైసెన్స్ తీసుకోవడమే కాకుండా సంతాన నియంత్రనకు చర్యలు తీసుకున్నట్లు కూడా యజమాని నిరూపించాలని మున్సిపల్ కార్పొరేషన్ పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో కుక్కల మల, మూత్ర విసర్జనను యజమానులు వెంటనే శుభ్రం చేయాలని, లేకపోతే భారీగా జరిమానాలు విధిస్తామని కూడా పేర్కొంది. ఈ మేరకు సిద్ధమైన ఉత్తర్వులను నగర మున్సిపల్ కార్పొరేషన్ అధికారికంగా ఇంకా విడుదల చేయాల్సి ఉంది.
పెంపుడు కుక్కల జాబితా నుంచి తొలగించిన కుక్కల బ్రీడర్లపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని నగరంలోని జంతు హక్కుల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కుక్కల బ్రీడర్లకు కూడా కొత్త నిబంధనల్లో లైసెన్స్‌ను తప్పనిసరి చేశారు. నగరంలో దాదాపు 15 బ్రీడింగ్ సెంటర్లు అనధికారికంగా నడుస్తున్నాయని జంతు హక్కుల కార్యకర్తలు తెలిపారు.