వెండితెరపై భువనగిరి ఖిల్లా..
మలావత్ పూర్ణ తొలి అడుగులు పడింది ఈ ఖిల్లాపైనే..
- 31న దేశవ్యాప్తంగా విడుదల కానున్న పూర్ణ సినిమా
భువనగిరి: నిజామాబాద్ జిల్లా పాకాలలోని ఓ నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టిన మలావత్ పూర్ణ ఎవరెస్టు శిఖరాన్ని అధి రోహించి.. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు. 13 ఏళ్ల వయస్సులోనే 2014 మే 20వ తేదీన ప్రపంచంలోని ఎత్తయిన పర్వత శిఖరాన్ని అధిరోహించిన ఆమె పయనానికి తొలి అడుగులు నేర్పింది యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఏకశిలా పర్వతం. పలువురికి స్ఫూర్తిదాయకమైన పూర్ణ జీవిత చరిత్రను వెండి తెరపైకి ఎక్కిస్తున్నారు. సామాన్య బాలిక సాధించిన అసామాన్య విజయగాథ ఎందరి జీవితాలకో ఆదర్శంగా ఉండేలా ప్రముఖ బాలీవుడ్ సినీ దర్శక, నిర్మాత రాహుల్ బోస్ తీర్చిదిద్దిన చలన చిత్రంలో పూర్ణకు అరుదైన గౌరవం దక్కు తుండగా ఆమె శిక్షణ ఇచ్చినవారితోపాటు భువనగిరి ఖిల్లా ఖ్యాతి వెండి తెర దృశ్యాలతో విశ్వవ్యాప్తం కానుంది. ఈ నెల 31న దేశ వ్యాప్తంగా 280 థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఈ చిత్రంలో గురుకుల పాఠశాల విద్యార్థినిగా సాధించిన విజయాలు, ఆమెకు సంబంధం ఉన్న ప్రాంతాలను చిత్రీకరించారు. పూర్ణ పుట్టి పెరిగిన గ్రామం తోపాటు చదువుకున్న పాఠశాల, శిక్షణ తీసుకున్న భువనగిరి ఖిల్లా, రాక్‌క్లైంబింగ్ శిక్షణ దృశ్యాలను వెండి తెర పైకి ఎక్కించారు. వెండి తెర పైకి ఎక్కుతుండడంతో భువనగిరి ఖిల్లా ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించ నుందని కోచ్ బచేనపల్లి శేఖర్‌బాబు అన్నారు.
గర్వంగా ఉంది: ‘నా విజయగాథపై బాలీవుడ్ చిత్రాన్ని తీయడం గర్వంగా ఉంది. ఈ స్థాయికి రావడానికి గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్‌ఎస్. ప్రవీణ్‌కుమార్, కోచ్ శేఖర్ బాబులే ప్రధాన కారణం. భువనగిరి ఖిల్లా ఖ్యాతి కూడా ప్రపంచమంతా తెలిసింది.’ అని మలావత్ పూర్ణ పేర్కొంది.