
అమెరికాలోమళ్లీ మంచు తుపాను
ఫిలడెల్ఫియా: అమెరికా తూర్పు ప్రాంతాన్ని మంచు తుపాను మళ్లీ ముంచెత్తింది. మంచు తుపాను తాకిడికి ఇద్దరు మరణించారు. న్యూయార్క్ నగరంతో పాటు పలుచోట్ల సోమవారం నేలపై ఎనిమిది అంగుళాల మేరకు మంచు పేరుకుపోయింది. ఫలితంగా జనజీవనం స్తంభించిపోయింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పాటు వందలాది విమానాలు రద్దయ్యాయి. ఫిలడెల్ఫియా, నెవార్క్, న్యూజెర్సీ, న్యూయార్క్ సహా పలుచోట్ల 1900 విమానాలు రద్దు కాగా, 4300 విమానాలు ఆలస్యంగా నడిచాయి. మంచు తుపాను కారణంగా కనెక్టికట్, డెలావేర్, మేరీలాండ్, న్యూజెర్సీ, ఒహాయో, పెన్సిల్వేనియా, వెస్ట్ వర్జీనియాలలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. కాగా, మంగళవారం రాత్రి మరో తుపాను ఈ ప్రాంతాన్ని తాకే అవకాశముందని అమెరికా జాతీయ వాతావరణ విభాగం హెచ్చరించింది.