అమెరికాను వణికిస్తున్న మంచుతుఫాను
⇒ పలు చోట్ల గాఢాంధకారం
⇒ ఇళ్ల నుంచి బయటికి రావొద్దని అధికారుల సూచన
⇒ విమానాల రద్దు, స్కూళ్లకు మూత
వాషింగ్టన్: అమెరికా తూర్పు తీరం చిగురుటాకులా వణికిపోతున్నది. మంచు తుఫాన్ తీవ్రమవడంతో మూడు కోట్ల మంది అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటికే 7,600 విమానాలు రద్దయ్యాయి. వేలాది స్కూళ్లు మూతపడ్డాయి. దీంతో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, వీక్షణస్థాయి సున్నా పడిపోనుండటంతో అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. అమెరికాలోని ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ మంచు తుఫాన్ కారణంగా ప్రభావితమవుతున్నట్లు సీఎన్‌ఎన్ చానెల్ వెల్లడించింది. న్యూయార్క్, బోస్టన్‌లాంటి ప్రధాన నగరాలను మంచు దుప్పటి కప్పేస్తుందని అంచనా వేస్తున్నారు. రెండు అడుగుల మేర భారీగా మంచు కురిసే అవకాశాలు ఉన్నట్లు మంగళవారం వాతావరణ నివేదికలు తెలిపాయి.
ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు ఈ ప్రాంతంలోని అన్ని విమానాలను రద్దు చేశారు. న్యూయార్క్ నగరంలో 20 అంగుళాల మేర మంచు కురవనున్నట్లు అంచనా వేస్తున్నారు. న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కూమో అత్యవసర చర్యలకు ఆదేశించారు. ఇప్పటికే భారీగా బలగాలను నగరంలో మోహరించారు. ఫిలడెల్ఫియాలో 10 అంగుళాలు, మసూచుసెట్స్‌లో 24 అంగుళాల మేర మంచు కురవనుంది. మంగళవారం ఉదయం నుంచి కనెక్టికట్ రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణాలపై నిషేధం విధించారు. అటు వర్జీనియాలో పోర్ట్ ఆఫ్ వర్జీనియాను కోస్ట్ గార్డ్ మూసివేసింది. తూర్పు తీరంలో ప్రజలంతా సురక్షితంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఇప్పటికే మంచు తుఫాన్ కారణంగా విస్కాన్సిన్‌లో ఇద్దరు చనిపోయారు.
సేవా కార్యక్రమాలకు ట్రంప్ జీతం
వివాదాలతో సహజీవనం చేసే అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మంచి నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ తన జీతం మొత్తాన్ని విరాళంగా ఇస్తారని వైట్‌హౌస్ అధికారి సీన్ స్పైసర్ వెల్లడించారు.ట్రంప్ తన వార్షిక జీతం నాలుగు లక్షల డాలర్లను సేవాసంస్థకు ఇస్తారని వెల్లడించారు. ఏడాది చివరన తన జీతాన్ని విరాళంగా ఇవ్వాలనేది ట్రంప్ ఉద్దేశమని స్పైసర్ మీడియాకు వివరించారు. అంతేగాక, ఈ విషయమై ట్రంప్ ఇప్పటికే అమెరికా ప్రజలకు వాగ్దానం చేశారని ఆయన గుర్తు చేశారు.
మా జోలికొస్తే ఊరుకోం: అమెరికాకు ఉత్తర కొరియా హెచ్చరిక
సియోల్: తమ దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న చర్య జరిగినా అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఉత్తరకొరియా మంగళవారం హెచ్చరించింది. వాయు, జల, భూమార్గాల ద్వారా నిర్దాక్షిణ్యంగా దాడులు చేయడానికి ఉత్తర కొరియా సిద్ధంగా ఉందని వెల్లడించింది. దక్షిణ కొరియాతో కలిసి నిర్వహిస్తున్న డ్రిల్స్‌లో భాగంగా అమెరికా నేవీ ‘కార్ల్ విన్సన్’ అనే యుద్ధనౌకను మోహరిస్తున్న నేపథ్యంలో కొరియా ఈ హెచ్చరిక జారీ చేసింది. కార్ల్ విన్సన్‌ను మోహరించడం వెనుక తమ దేశంపై దాడి చేయాలనే కుట్ర దాగుందని ఆరోపించింది. ఈ నెల 11న సైతం శత్రువుల యుద్ధవిమానాలు తమ ప్రాదేశిక జలాల సమీపంలోకి వచ్చాయని ఉత్తరకొరియా ఆరోపించింది. ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా దక్షిణ కొరియాలో క్షిపణి విధ్వంసక వ్యవస్థను మోహరించడంపై చైనా అమెరికాను విమర్శించిన విషయం తెలిసిందే.