సూసైడ్‌కు ముందు కలెక్టర్ సెల్ఫీ వీడియో
న్యూఢిల్లీ: బిహార్‌లో కలెక్టర్ ముకేశ్ పాండే ఆత్మహత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. తన మరణానికి ఎవరూ కారణం కాదని సూసైడ్ లేఖలో పేర్కొన్న ఆయన, చనిపోవటానికి ముందు ఓ వీడియోను రికార్డు చేశారు. పోలీసులు ఆ వీడియోను స్వాధీనపరుచుకున్నట్లు తెలుస్తోంది.
32 ఏళ్ల బక్సర్ కలెక‍్టర్‌గా ఈ మధ్యే బదిలీ అయ్యారు. అక్కడే ఆయన ఈ వీడియోను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. తన బిడ్డ గురించి, భార్య తనను ఎంత ప్రేమిస్తుందో అన్న విషయాలను ఆయన అందులో చెప్పుకొచ్చారు. దీంతో మానసిక రుగ్మతతోనే ఆయన బలవన్మరణానికి పాల్పడినట్లు స్పష్టమౌతోంది.
గురువారం మధ్యాహ్నం లీలా ప్యాలెస్ హోటల్ నుంచి ఓ మాల్ వద్దకు క్యాబ్ బుక్ చేసుకున్నారు. వాట్సాప్‌లో బంధువులకు తాను ఆత్మహత్య చేసుకుంటున్న విషయాన్ని తెలియజేశారు. బంధువులు పోలీసులను అప్రమత్తం చేయగా, అప్పటికే ఆయన మాల్ వద్ద నుంచి వెళ్లిపోయారు. సీసీ పుటేజీల్లో బ్లూ టీషర్ట్, జీన్స్ ధరించిన పాండే ఘజియాబాద్ మెట్రో స్టేషన్ వైపుగా వెళ్లిన దృశ్యాలు నమోదయ్యాయి. ఆ తర్వాతే ఆయన శవాన్ని పోలీసులు పట్టాలపై కనుగొన్నారు.
ఆల్ ఇండియా సివిల్స్ సర్వీస్ పరీక్షలో 14వ ర్యాంకర్ అయిన ముకేశ్ పాండే, సమర్థవంతమైన ఆఫీసర్ గా సీఎం నితీశ్ కుమార్ నుంచి ప్రశంసలు అందుకున్నారు. "మనిషి అనేవాడికి ఈ భూమిపై మనుగడ లేదని, తనకు జీవించాలనే కోరిక చచ్చిపోయిందని, తన చావు గురించి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేయండని" అని పాండే తన సూసైడ్ లేఖలో పేర్కొన్నారు.