బిహార్ ఎన్నికల బరిలో వారసులు | Bihar polls: RJD chief Lalu Prasad Yadav fields two sons | Sakshi
Sakshi News home page

బిహార్ ఎన్నికల బరిలో వారసులు

Published Thu, Sep 24 2015 3:01 AM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

తేజస్వియాదవ్ మహువా, తేజ్‌ప్రతాప్ యాదవ్ - Sakshi

తేజస్వియాదవ్ మహువా, తేజ్‌ప్రతాప్ యాదవ్

242 మందితో ‘మహాకూటమి’ జాబితా విడుదల చేసిన నితీశ్‌కుమార్
* బరిలో లాలూ ఇద్దరు కుమారులు
* వెనుకబడిన వర్గాల ఓట్లే లక్ష్యంగా సీట్ల కేటాయింపు
పట్నా/న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరి రసకందాయకంగా మారనుంది. ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ పార్టీల ‘మహాకూటమి’ అభ్యర్థుల జాబితాను బిహార్ సీఎం, మహాకూటమి సీఎం అభ్యర్థి నితీశ్‌కుమార్ బుధవారం విడుదల చేశారు. ఇందులో ప్రధాన నేతల వారసులు పోటీలో ఉండనున్నారు.

ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ కుమారులు తేజస్వియాదవ్ మహువా స్థానం నుంచి, తేజ్‌ప్రతాప్ యాదవ్ రాఘోపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అక్టోబర్ 12వ తేదీ నుంచి నవంబర్ 5 వరకు ఐదు దశల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీకి 242 మంది అభ్యర్థులతో మహాకూటమి జాబితాను నితీశ్‌కుమార్ విడుదల చేశారు. జేడీయూ, ఆర్జేడీ 101 సీట్ల చొప్పున, కాంగ్రెస్ 41 స్థానాల్లో బరిలో ఉండనున్నాయి.

రిజర్వేషన్ల అంశంపై తీవ్ర దుమారం కొనసాగుతున్న నేపథ్యంలో... వెనుకబడిన వర్గాలకు అవకాశం కల్పించారు. వెనుకబడిన వర్గాలవారికి 55శాతం, ఎస్సీ/ఎస్టీలకు 15శాతం, ముస్లింలకు 14శాతం, ఓసీ అభ్యర్థులకు 16శాతం టికెట్లు ఇచ్చినట్లు నితీశ్ పేర్కొన్నారు. మొత్తం అభ్యర్థుల్లో 10శాతం (25 మంది) మహిళలకు ఇచ్చినట్లు తెలిపారు. మొత్తంగా నితీశ్‌కుమార్‌కు మద్దతుదారులుగా ఉన్న కుర్మి, కుశ్వహ కులాలవారికి జేడీయూ తరఫున, లాలూకు గట్టి ఓటు బ్యాంకు అయిన యాదవ్‌లు, ముస్లింలకు ఆర్జేడీ తరఫున టికెట్లు కేటాయించారు.

ఇక కాంగ్రెస్ తరఫున ఓసీలకు అవకాశమిచ్చారు. బీజేపీకి ఎక్కువగా పట్టున్న పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. ఇక ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న కిషన్‌గంజ్ జిల్లాలోని నాలుగు స్థానాల్లో ఎంఐఎం తరఫున అభ్యర్థులను బరిలోకి దించారు. కాగా బిహార్ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ... ప్రధాని మోదీ, అద్వానీ, ఎంఎం జోషీ, రాజ్‌నాథ్, జైట్లీ సహా 40 మందికి పైగా హేమాహేమీలను ప్రచార రంగంలోకి దించనుంది.

ఇటీవలి కాలంలో అధిష్ఠానంతో విభేదిస్తూ వస్తున్న ఎంపీ శత్రుఘ్నసిన్హాను కూడా ఈ ప్రచారకర్తల జాబితాలో చోటు కల్పించటం విశేషం. మరోపక్క అసెంబ్లీ టికెట్టు నిరాకరించడంతో మంత్రి రామ్‌ధానీ సింగ్ బుధవారం పదవికి రాజీనామా చేశారు. జేడీ (యూ)కు గుడ్‌బై చెప్పారు. తన నియోజకవర్గమైన కార్గహర్ నుంచి సమాజ్‌వాది టికెట్టుపై బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు.
 
బీజేపీకి ఆర్‌ఎస్‌ఎస్ సుప్రీంకోర్టు లాంటిది

* భాగవత్ చెప్పిందే బీజేపీకి ఫైనల్: నితీశ్‌కుమార్
పట్నా/ముంబై: దేశంలో రిజర్వేషన్ల విధానంపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌పై విమర్శల పరంపర కొనసాగుతోంది. భాగవత్ వ్యవహారంలోబీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీకి ఆరెస్సెస్ సుప్రీంకోర్టు లాంటిదని వ్యాఖ్యానించిన నితీశ్.. ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ కలసి రిజర్వేషన్లను తొలగించాలని చూస్తున్నాయని ఆరోపించారు. రిజర్వేషన్లపై సమీక్ష కోసం మరో రాజ్యాంగ సంస్థను ఏర్పాటుకు ఆర్‌ఎస్‌ఎస్ ప్రయత్నిస్తోందన్నారు.    

సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం చెప్పిందే తుది తీర్పు అని అదే మాదిరిగా.. బీజీపీ నేతలకు భాగవత్ చెప్పిందే తుది నిర్ణయమని అన్నారు. కాగా, నితీశ్ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. నితీష్‌కుమార్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఆర్‌జేడీ చీఫ్ లాలూ ప్రసాద్‌నుంచి ఆదేశాలు, అనుమతులు పొందుతారని, ఎందుకంటే ఆయనకు వారిద్దరూ సుప్రీంకోర్టు లాంటి వారని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ జమ్మూలో విమర్శించారు. మరోవైపు బీజేపీ మిత్ర పక్షం శివసేన భాగవత్ వ్యాఖ్యలను స్వాగతించింది.
 
రాహుల్‌ను పంపించారు
బిహార్‌ఎన్నికల నేపథ్యంలో రాహుల్‌గాంధీ అమెరికా పర్యటనపై కాంగ్రెస్, బీజేపీల మధ్య విమర్శల యుద్ధం జరుగుతోంది. ‘వీకెండ్ విత్ చార్లీరోస్’ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు రాహుల్ అమెరికాలోని ఆస్పెన్‌కు వెళ్లారు. బిహార్ ఎన్నికలకు దూరంగా ఉండాలని మిత్రపక్షాలే రాహుల్‌పై ఒత్తిడి తెచ్చినందువల్లే ఆయన అమెరికా పర్యటకు వెళ్తున్నారని బీజేపీ నేత సంబీత్ పాత్రా విమర్శించారు.

ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుజ్రేవాలా మండిపడ్డారు. ప్రపంచ స్థాయిలో వివిధ అంశాలపై చర్చించే సదస్సుకు రాహుల్ వెళుతున్నారని...కానీ ‘రిజర్వేషన్ల’ వివాదం నుంచి దృష్టి మళ్లించేందుకు బీజేపీ పని గట్టుకునిఅవాస్తవాలనుప్రచారం చేస్తోందన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement