ఛాత్ పూజలో రబ్రీదేవీ, లాలూ యాదవ్ (ఫైల్ పొటో)
పాట్నా: బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీ దేవీ అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించారు. బిహారీలు ఘనంగా నిర్వహించే 'ఛాత్' పండుగను ఈ ఏడాది జరుపుకోబోనని సోమవారం మీడియాకు చెప్పారు. పెళ్లైన నాటి నుంచి ఏటా క్రమం తప్పకుండా ఛాత్ పూజలో పాల్గొంటోన్న రబ్రీదేవీ.. ఒక రకంగా ఆ పండుగకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు. లాలూ ఇంట జరిగే వేడుకకు రాష్ట్రం నలుమూలల నుంచే కాక దేశంలోని కీలక రాజకీయపక్షాల నాయకులు సైతం హాజరై సందడిచేస్తారు. అయితే ఈ వారాంతంలో జరుగనున్న పండుగకు మాత్రం దూరంగా ఉంటానని రబ్రీ చెప్పారు. ఇంతకీ ఆమె నిర్ణయం వెనుక కారణం ఏమంటే..
ఇద్దరు కొడుకుల పెళ్లి. అవును. లాలూ-రబ్రీ దంపతుల కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వీ యాదవ్ ల పెళ్లిళ్లు జరిగిన తర్వాతే తాను తిరిగి 'ఛాత్' పూజలో పాల్గొంటానని రబ్రీ దేవి అన్నారు. నితీశ్ కుమార్ ప్రభుత్వంలో తేజస్వి యాదవ్ ఉపముఖ్యమంత్రికాగా, తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. వీళ్లిద్దరి పెళ్లి విషయమై గడిచిన కొద్దిరోజులుగా లాలూ కుటుంబం తీవ్ర కసరత్తు చేస్తోంది. మొన్నటికిమొన్న రాష్ట్రంలో సమస్యలు తెలపాలంటూ వాట్సాప్ నెంబర్ ప్రకటించిన డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కు ఏకంగా 44వేల పెళ్లి ఆఫర్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఎలాగైనాసరే వచ్చే ఎండలనాటికి ఇద్దరు కొడుకుల పెళ్లిళ్లు చేసి, కోడళ్లతో సహా వచ్చే ఏడాది ఛాత్ పండుగ జరుపుకోవాలన్న మాజీ సీఎం కల ఏమేరకు నెరవేరుతుందో చూడాలి! దీపావళి తర్వాతి వారాంతంలో ప్రారంభమయ్యే ఛాత్ పండుగను బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ సహా నేపాల్ లోనూ నాలుగురోజులపాటు ఘనంగా జరుపుకొంటారు.