ఇక మావోయిస్టుల ఆస్తులు సీజ్!!
మావోయిస్టుల ఆస్తులను ఇక సీజ్ చేయాలని బీహార్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఓ పోలీసు అధికారి తెలిపారు. మొత్తం 47 మంది ఆస్తులు సీజ్ చేయాలని నిర్ణయించగా, ఇప్పటికే 9 మంది విషయంలో రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి అమీర్ సుభానీ నుంచి ఉత్తర్వులు కూడా వెలువడినట్లు ఆయన చెప్పారు. రెండు నెలల క్రితం దేశంలోనే తొలిసారిగా బీహార్ ప్రభుత్వం ఆరుగురు మావోయిస్టుల ఆస్తులను సీజ్ చేసి బీహార్ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది.
దీంతో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలన్నింటిలోనూ ఇలాంటి చర్యలే చేపట్టాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ అందరికీ తెలిపింది. మావోయిస్టు అగ్రనాయకుల బ్యాంకు ఖాతాలు, ఆస్తుల వివరాలు సేకరించి, వాటిని స్వాధీనం చేసుకోవడం ప్రారంభించాలని చెప్పింది. ముఖ్యమంత్రుల సమావేశంలో బీహార్ సీఎం నితిష్ కుమార్ ఈవిషయాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్కు వివరించారు.