టాపర్ రుబీరాయ్ అరెస్టు సబబేనా?
బిహార్ బోర్డ్ టాపర్ల కుంభకోణంలో విద్యార్థులను అరెస్టు చేయడం కొత్త వివాదాన్ని రేపుతోంది. తమ బిడ్డలకు మంచి ర్యాంకులు రావాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు, డబ్బుకు ఆశపడి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రభుత్వ అధికారులు ఈ ర్యాంకుల స్కాంకు ప్రధాన కారకులు కాగా, అమాయకులైన విద్యార్థుల అరెస్టు ఎంతవరకు సబబు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తాజాగా ఈ వివాదంపై స్పందించిన కేంద్ర మంత్రి ఉపేంద్ర కుశ్వాహ రుబీరాయ్‌ను అరెస్టు చేయడం సరికాదని పేర్కొన్నారు. 12వ తరగతి పరీక్షల ఫలితాల్లో ఇంత పెద్ద కుంభకోణం జరగడానికి నితీశ్‌కుమార్ సర్కారే కారణమని ఆయన నిందించారు. బిహార్ కు చెందిన ఆయన కేంద్ర మానవ వనరులశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.
విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు ప్రధాన కారకులైన టాపర్ల కుంభకోణంలో అమాయకులైన విద్యార్థులను బలిచేయడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. ఈ స్కాంలో విద్యార్థులను అరెస్టు చేయడం కాకుండా.. ఇందులోని పెద్ద తలకాయలు, రాజకీయ ప్రముఖుల పేర్లను నితీశ్ ప్రభుత్వం బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. 12వ తరగతి టాపర్ కుంభకోణంపై విచారణలో భాగంగా రుబీరాయ్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.