బీహార్‌లో ఘోర రైలు ప్రమాదం.. 37మంది దుర్మణం | Bihar train accident: 37 people, mostly pilgrims, killed; crowd assaults train driver | Sakshi
Sakshi News home page

బీహార్‌లో ఘోర రైలు ప్రమాదం.. 37మంది దుర్మణం

Published Tue, Aug 20 2013 1:30 AM | Last Updated on Fri, Sep 1 2017 9:55 PM

బీహార్‌లో ఘోర రైలు ప్రమాదం.. 37మంది దుర్మణం

బీహార్‌లో ఘోర రైలు ప్రమాదం.. 37మంది దుర్మణం

ఖగారియా: బీహార్‌లో ఘోరం జరిగిపోయింది. రైల్వే ట్రాక్ దాటుతున్నవారిపైకి ఎదురుగా వస్తున్న మరో రైలు దూసుకుపోవడంతో 37 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో 13 మంది మహిళలు, నలుగురు పిల్లలున్నారు. మరో 24 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. పాట్నాకు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖగారియా జిల్లాలోని ధమారాఘాట్ స్టేషన్‌లో సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో ఈ పెను ప్రమాదం చోటుచేసుకుంది. కళ్లముందే తమ వారంతా పట్టాల కింద నలిగిపోయి ప్రాణాలు కోల్పోవడంతో వారి బంధువులు ఆగ్రహోదగ్రులయ్యారు.
 
  రైల్వేస్టేషన్‌లోకి చొరబడి విధ్వంసానికి దిగారు. ఏసీ కోచ్ సహా ఆరు బోగీలు, ఇంజిన్‌కు నిప్పంటించారు. కొందరు రైల్వే ఉద్యోగులను బందీలుగా పట్టుకున్నారు. ప్రమాదంపై ప్రధాని మన్మోహన్‌సింగ్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులకు సానుభూతి ప్రకటించారు. స్థానికులు ఆవేశానికి లోను కావొద్దని, సంయమనం పాటించాలని ప్రధాని కోరారు. ఈ ఘటనపై రైల్వేశాఖ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.లక్ష పరిహారం ప్రకటించింది.
 
 ప్రమాదం ఎలా జరిగిందంటే: సమస్తిపూర్-సహర్సా ప్యాసింజర్ రైలు ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ధమారాఘాట్ స్టేషన్‌కు వచ్చి ఆగింది. ఈ రైలు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు దిగారు. పవిత్ర శ్రావణ మాసం.. అందులోనూ సోమవారం కావడంతో వీరంతా సమీపంలోని కాత్యాయనిస్థాన్ ఆలయంలో శివలింగానికి జలాభిషేకం చేయడానికి వెళ్తున్నారు. అవతలి వైపు వెళ్లడానికి ట్రాక్ దాటుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో మరోవైపు నుంచి సహర్సా-పాట్నా రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ 80 కిలోమీటర్ల వేగంతో దూసుకువచ్చింది. వాస్తవానికి ఈ ఎక్స్‌ప్రెస్ ధమారాఘాట్ స్టేషన్‌లో ఆగదు. దీంతో డ్రైవరు అదే వేగంతో రైలును పోనివ్వడం, పట్టాలపై నడుస్తున్నవారంతా చక్రాల కింద పడిపోయి చనిపోవడం క్షణాల్లో జరిగిపోయింది.
 
  మృతులంతా ఖగారియా, సహర్సా, ముంగర్, నౌగాచియా ప్రాంతాలకు చెందినవారు. ‘‘సహర్సా-పాట్నా రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్‌కు ధమారాఘాట్‌లో హాల్ట్ లేదు. దీంతో అధికారులు రైలు ముందుకు వెళ్లేందుకు క్లియరెన్స్ ఇచ్చారు. రైలు ఆగుతుందేమో అన్న ఉద్దేశంతో యాత్రికులు ట్రాక్ దాటారు. వారి దగ్గరికి రాగానే డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేకులను నొక్కారు. కానీ అప్పటికే ఘోరం జరిగిపోయింది’’ అని రైల్వే బోర్డు చైర్మన్ అరుణేంద్ర కుమార్ చెప్పారు. ప్రమాదం తర్వాత మృతుల బంధువులు, స్థానికులు సమస్తిపూర్-సహర్సా ప్యాసింజర్ రైలు బోగీలు, ఇంజిన్ తోపాటు సహర్సా-పాట్నా రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఏసీ కోచ్‌కు నిప్పు పెట్టారు. ఘటన జరిగిన అనంతరం ఎక్స్‌ప్రెస్ రైలు డ్రైవర్లు రాజారాం పాశ్వాన్, సుశీల్ కుమార్ సుమన్ అక్కడ్నుంచి పారిపోయారు. తర్వాత తాము క్షేమంగానే ఉన్నట్టు రైల్వే అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు.
 
 రాష్ట్ర నిర్లక్ష్యం లేదు: సీఎం నితీశ్
 ప్రమాదం వెనుక రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఏమీ లేదని బీహార్ సీఎం నితీశ్ కుమార్ చెప్పారు. మృతుల కుటుంబీకులకు రూ.2 లక్షల పరిహారం ఇస్తామని, క్షతగాత్రులకు ఉచితంగా చికిత్స చేయిస్తామని ప్రకటించారు. ప్రమాదం విషయం తెలియగానే ఖగారియా, సహర్సా జిల్లాల నుంచి రాష్ట్ర అధికారులను పంపామని, అయితే సరైన రోడ్డు మార్గం లేకపోవడం, మధ్యలో ఓ బ్రిడ్జి పాడవడంతో రెండు జిల్లాల నుంచి ఎక్కడ్నుంచి వెళ్లినా మూడు గంటలపాటు కాలినడకన వెళ్లాల్సి వచ్చిందని వివరించారు. రైల్వేశాఖ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారా అని ప్రశ్నించగా.. ఇందుకు సమాధానం చెప్పాల్సింది ఆ శాఖ వారే అని బదులిచ్చారు. ఇది అత్యంత అరుదుగా జరిగే ప్రమాదాల్లో ఒకటని వ్యాఖ్యానించారు. పూర్తి దర్యాప్తు తర్వాతే అన్ని వివరాలు తెలుస్తాయన్నారు.
 
 ప్లాట్‌ఫాం లేకున్నా కిందకు దిగారు: రైల్వేమంత్రి ఖర్గే
 ప్రమాదంపై రైల్వేమంత్రి మల్లిఖార్జున ఖర్గే సోమవారం రాజ్యసభలో మాట్లాడారు. ‘‘ధమారాఘాట్ స్టేషన్ వద్ద రెండు ప్యాసింజర్ రైళ్లు ఆగాయి. ఇందులోంచి కొందరు ప్రయాణికులు ప్లాట్‌ఫాం లేని వైపు దిగారు. అదే సమయంలో రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ వచ్చింది. మలుపుగా ఉండడంతో డ్రైవర్‌కు పట్టాలపై ఉన్నవారు సరిగ్గా కనిపించలేదు. అయినా కొంతదూరం రాగానే అత్యవసర బ్రేకులు వేసినా అప్పటికే ప్రమాదం జరిగిపోయింది’’ అని ఆయన వివరించారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలిపారు. సహాయక సిబ్బందితో కూడిన రైలు ఘటనా ప్రాంతానికి 11 గంటల సమయంలో చేరుకుందని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement