బీజేపీ సంచలన విజయం!
షిమ్లా: షిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ తొలిసారి చరిత్ర సృష్టించింది. గురువారం వెలువడిన ఫలితాల్లో ఆ పార్టీ గతంలో ఎన్నడూలేనివిధంగా అత్యధిక సీట్లు సాధించింది. 34 స్థానాలు ఉన్న షిమ్లా మున్సిపాల్ కార్పొరేషన్‌లో బీజేపీ 17 సీట్లు సాధించి.. మెజారిటీ (18)కి ఒక్క స్థానం దూరంలో నిలిచింది. బీజేపీ బద్ధ విరోధి కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలతో సరిపెట్టుకుంది. 26 ఏళ్లుగా షిమ్లా నగరపాలక మండలిలో చక్రం తిప్పిన కాంగ్రెస్.. గత 2012 ఎన్నికల్లో అధికారం కోల్పోయింది.
తాజా ఎన్నికల్లో నలుగురు స్వతంత్ర అభ్యర్థులు, ఒక సీపీఎం అభ్యర్థి కూడా విజయం సాధించారు. స్వతంత్రుల్లో ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించినా.. ఆ పార్టీ 15స్థానాలతో మెజారిటీకి చాలా దూరంలో ఉంది. మెజారిటీకి ఒక్కస్థానం తక్కువగా ఉన్న బీజేపీ మాత్రం షిమ్లా మున్సిపాలిటీని తామే కైవసం చేసుకుంటామని, ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతు తమకుందని ప్రకటించింది.
2012లో ప్రత్యక్ష ఎన్నికల పద్ధతిలో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఓటింగ్ నిర్వహించగా సీపీఎం సంచనలరీతిలో ఈ పదవులను సొంతం చేసుకుంది. ఈ సారి పరోక్ష పద్ధతిలో మెజారిటీ ఆధారంగా ఎన్నికలు నిర్వహించగా.. ఈసారి అనూహ్యంగా కమలనాథులను విజయం వరించడం గమనార్హం.