'బీఎస్పీని ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధించాలి'
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ప్రధాన రాజకీయ పక్షాల విమర్శలు, విసుర్లు, ఫిర్యాదులతో హోరెత్తుతున్నాయి. నిన్నటిదాకా నరేంద్రమోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన బీఎస్పీ అధినేత్రి మాయావతిని తాజాగా బీజేపీ టార్గెట్ చేసింది. ఆమెకు వ్యతిరేకంగా కేంద్ర ఎన్నిక సంఘానికి(ఈసీ) ఫిర్యాదు చేసింది.
ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు మతాన్ని, కులాలను ఉపయోగించుకోవద్దని తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను మాయావతి ఉల్లంఘించారని, కాబట్టి ఆమె పార్టీని ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధించాలని బీజేపీ కోరింది. అంతేకాకుండా సుప్రీంకోర్టు ఉత్తర్వులను అతిక్రమించినందుకు మాయావతిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బీజేపీ యూపీ కార్యవర్గ సభ్యుడు నీరజ్‌కుమార్ సక్సేనా ఈసీకి ఫిర్యాదు చేశారు.
బీఎస్పీ శ్రేణులు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలోనూ 'ముస్లింల స్వచ్ఛమైన శ్రేయోభిలాషి ఎవరు.. మీరే నిర్ణయించండి' అంటూ బుక్‌లెట్లు పంచుతున్నారని, అంతేకాకుండా జనవరి 3న జరిగిన ప్రెస్‌మీట్‌లో కులాల వారీగా పార్టీ టికెట్లు కేటాయించామని మాయావతియే స్వయంగా చెప్పారని ఆయన ఆరోపించారు. ‘మొత్తం 403 సీట్లలో 85 ఎస్సీలకు, 87 సీట్లు దళితులకు, 97 సీట్లు ముస్లింలకు, 106 సీట్లు ఓబీసీలకు, 66 సీట్లు బ్రాహ్మణులకు ఇచ్చాం. క్రైస్తవులకు 36 సీట్లు కేటాయించగా, మిగిలిన 11 సీట్లు వైశ్యులు, పంజాబీలు, కాయస్థాలకు ఇచ్చాం' అని మాయావతి ప్రెస్‌మీట్‌లో పేర్కొన్నారని ఆయన గుర్తుచేశారు.