నిందితుడు నిషాంక్(రెడ్‌సర్కిల్), ఎమ్మెల్యే సుభాష్(బ్లూ)
- ఇద్దరు మైనర్ బాలుర సజీవ సమాధి
- తండ్రులు ఎదురుతిరిగినందుకు పిల్లలపై ప్రతీకారం
- యూపీలోని బహ్రయిచ్ జిల్లాలో దారుణం
బహ్రెయిచ్: అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకుననే గర్వం.. కిరాతకానికి ఒడిగట్టేలా చేసింది. ఇద్దరు మైనర్ బాలురను సజీవసమాధిచేసిన కేసులో బీజేపీ ఎమ్మెల్యే కొడుకుతోపాటు ఇసుక మైనింగ్ కాంట్రాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్ జిల్లా భౌరీ అనే గ్రామంలో చోటుచేసుకుందీ ఘటన.
భౌరీ గ్రామానికి చెందిన దళిత బాలురు కరణ్(10), నిస్సార్(11) బుధవారం నుంచి కనిపించకుండా పోయారు. రోజంతా వెతికినా పిల్లలు కనిపించకపోవడంతో తండ్రి చేత్రామ్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. గురువారం నాటికి గాలింపు చర్యను ముమ్మరం చేయగా.. గ్రామాన్ని ఆనుకునే ప్రవహించే ఘంఘారా నది వద్ద నిసార్ మృతదేహం కనిపించింది. దానికి కొద్ది దూరంలోనే కరణ్‌ను ఇసుకలో పాతిపెట్టినట్లు గుర్తించారు. శవాలు దొరికిన ప్రాంతంలోనే ఇసుక మాఫియా ర్యాంప్ ఉంది. దీంతో ఇది ఖచ్చితంగా ఎమ్మెల్యే కొడుకు పనే అయిఉంటుదని గ్రామస్తులు ఆగ్రహించారు. అక్కడి ప్రొక్లెయినర్లు, లారీలను తగులబెట్టారు.
కొన్నాళ్లుగా ఘంఘారా నదిలో నుంచి పెద్ద ఎత్తున ఇసుక అక్రమరవాణా జరుగుతున్నదని, దీనికి కర్త, కర్మ, క్రియ అన్నీ స్థానిక(పయాగ్‌పూర్) బీజేపీ ఎమ్మెల్యే సుభాష్ త్రిపాఠినే అనే ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యే అనుచరుడైన మనోజ్ శుక్లా పేరు మీద మైనింగ్ లైసెన్స్ తీసుకుని, అనుమతించినదానికంటే పదింతలు ఎక్కువ ఇసుకను రవాణా చేస్తున్నట్లు తెలిసింది. దీంతో పంటపొలాలు బీడుపడ్డాయి. స్థానిక రైతులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఛేత్రామ్(చనిపోయిన బాలుర తండ్రి), ఇంకొందరు గ్రామస్తులు ఇసుక మాఫియాపై ప్రత్యక్ష పోరుకు దిగారు. పలుమార్లు లారీలను ఆపేసే ప్రయత్నం చేశారు. ఇసుక మాఫియా వ్యవహారమంతా ఎమ్మెల్యే కొడుకు నిషాంక్ త్రిపాఠి పర్యవేక్షిస్తుంటాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
కలెక్టర్ మాట ఒకలా.. పోలీసుల యాక్షన్ మరోలా
ఘంఘారా నదిలో ఇసుక మాఫీయా లేదని, మనోజ్ శుక్లా ఎమ్మెల్యే అనుచరుడే అయినప్పటికీ అధికారికంగా లైసెన్స్ పొందాడని బహ్రెయిచ్ కలెక్టర్ తెలిపారు. గతంలో భౌరీ గ్రామానికి చెందినవారే కాంట్రాక్టర్లుగా ఉండేవారని, ఇటీవలే అది ఎమ్మెల్యే అనుచరుడికి దక్కడంతో స్థానికులు కోపంగా ఉన్నారని కలెక్టర్ వివరించారు. గ్రామస్తులు పలుమార్లు ఇసుక తవ్వకాలను అడ్డుకునే ప్రయత్నం చేశారని గుర్తుచేశారు. అయితే పిల్లలు ఎలా చనిపోయారనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉందని, దీనిపై విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. కాగా, కలెక్టర్ వివరణకు భిన్నంగా పోలీసులు.. ఎమ్మెల్యే కొడుకు, మైనింగ్ కాంట్రాక్టర్లపై హత్య కేసు నమోదు చేయడం గమనార్హం.
రాజకీయ కుట్రతో ఇరికించారు: ఎమ్మెల్యే త్రిపాఠి
తాము ఇసుక అక్రమరవాణా చేయడంలేదని, అధికారికంగానే కాంట్రాక్టులు తీసుకున్నామని ఎమ్మెల్యే సుభాష్ త్రిపాఠి చెప్పుకొచ్చారు. పిల్లల మరణాలకు, తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని, రాజకీయ కుట్రలో భాగంగానే తమ కుటుంబాన్ని ఇందులో ఇరికించారని ఆరోపించారు.
కోవింద్ రావాల్సిందే: ఆజంఖాన్
చనిపోయిన దళిత బాలల దహనసంస్కారాలకు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ హాజరుకావాలని సమాజ్‌వాదీ పార్టీ నేత, మాజీ మంత్రి ఆజంఖాన్ డిమాండ్ చేశారు. ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా బీజేపీ అధికారంలోఉన్న ఉత్తరప్రదేశ్‌లో దళితులు, మైనారిటీలకు రక్షణ లేకుండాపోయిందని ఆరోపించారు.