మరోసారి బీజేపీ ప్రభంజనం!
- పెద్దనోట్ల రద్దు లిట్మస్ టెస్టులో పాస్!
మహారాష్ట్ర మున్సిపాలిటీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బీజేపీ గుజరాత్‌లోనూ ఓ వెలుగువెలిగింది. గుజరాత్‌లోని మునిపాలిటీలు, జిల్లా పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది. మొత్తం 16 జిల్లాల్లోని 126 మున్సిపాలిటీలు, పంచాయతీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగగా, బీజేపీ ఏకంగా 109 స్థానాలు గెలిచింది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన 40 స్థానాలను సైతం తన ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 17 స్థానాలకు పరిమితమైంది. మహారాష్ట్ర, గుజరాత్ ఎన్నికల్లో విజయం బీజేపీకి పెద్ద ఊరటనిచ్చింది. ప్రధాని మోదీ ఆకస్మికంగా తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయానికి ఈ ఎన్నికలు తొలి కఠినమైన పరీక్షగా రాజకీయ నిపుణులు భావించారు. ఈ లిట్మస్ టెస్టులో బీజేపీ పాస్ కావడంతో కమలం శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది.
గుజరాత్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ అద్భుతమైన విజయాన్ని నమోదుచేయడంతో పార్టీ శ్రేణులకు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. బీజేపీ పట్ల మరోసారి విశ్వాసాన్ని చాటినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. దేశ సర్వతోముఖాభివృద్ధికి, అవినీతికి వ్యతిరేకంగా ప్రజలంతా మద్దతు పలికారని ప్రధాని మోదీ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.
Congratulations to @BJP4Gujarat Karyakartas, CM @vijayrupanibjp & @jitu_vaghani for their hardwork work across the state.
— Narendra Modi (@narendramodi) 29 November 2016