హస్తిన బీజేపీదే! : హర్షవర్ధన్
న్యూఢిల్లీ సాక్షి ప్రతినిధి ఎన్.సత్యనారాయణ: హస్తినలో గత 15 ఏళ్లుగా అధికార పీఠానికి దూరంగా ఉన్న బీజేపీ ఈసారి పీఠాన్ని దక్కించుకోవడానికి సర్వశక్తులూ ఒడ్డుతోంది. వివాద రహితుడు, క్లీన్ ఇమేజ్ ఉన్న డాక్టర్ హర్షవర్ధన్‌ను పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన నేతృత్వంలో ఈమారు దేశ రాజధానిలో కమలం వికాసం ఖాయమని బీజేపీ నాయకులు విశ్వసిస్తున్నారు. హర్షవర్ధన్ ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై స్పందించారు.
సాక్షి: ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి. ప్రధాన పోటీ ఎవరి మధ్య ఉండబోతోంది.
హర్షవర్ధన్: ఢిల్లీలో ఈసారి వంద శాతం బీజేపీ అధికారంలోకి వస్తుంది. దీనిలో ఎలాంటి సందేహం లేదు. కాంగ్రెసే మాకు ప్రధాన ప్రత్యర్థి.
సాక్షి: ఢిల్లీలో మహిళలకు భద్రత ప్రధానాంశంగా మారింది. మీ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి చర్యలు ఆశించొచ్చు.
హర్ష: కేంద్రంలోనూ బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్రీయ హోదా కల్పించేలా కృషి చేస్తాం. అప్పుడు ఢిల్లీ పోలీసు వ్యవస్థ మా పరిధిలోకి వస్తుంది. దాన్ని పటిష్టపర్చడంతో పాటు పోలీసుల సంఖ్య పెంచుతాం. మహిళలకు భద్రత మెరుగుపర్చేందుకు తగిన చర్యలు తీసుకుంటాం.
సాక్షి: ఢిల్లీలో సామాన్యులకు చుక్కలను చూపిస్తున్న నిత్యావసరాలు, కూరగాయల ధరల అదుపునకు తీసుకునే చర్యలేమిటి.
హర్ష: ధరల అదుపు అనేది మా ప్రభుత్వం చేపట్టబోయే చర్యల్లో ముఖ్యమైంది. మేనిఫెస్టోలో ఆ అంశాలన్నీ పొందుపర్చాం.
సాక్షి: ఢిల్లీలోనున్న దక్షిణ భారతీయులకు మీరిచ్చే భరోసా?
హర్ష: వారినీ ఢిల్లీవాసులుగానే చూస్తాం. మాకు అందరూ సమానమే. స్థానికులున్నట్లే వారికీ అవే సమస్యలు ఉన్నాయి. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా వాటన్నింటికీ పరిష్కారం చూపిస్తాం.
సాక్షి: ఢిల్లీ రాజకీయాల్లో దక్షిణ భారతీయులకు, ముఖ్యంగా దాదాపు 10 లక్షల మంది వరకు ఉన్న తెలుగువారికి ప్రాధాన్యత లభించడం లేదన్న వాదనలున్నాయి కదా.
హర్ష: మా పార్టీలో అందరికీ సమ ప్రాధాన్యం ఇచ్చేందుకే ప్రయత్నిస్తున్నాం.