తదుపరి రాష్ట్రపతి.. ఇప్పటికీ సస్పెన్సే!
న్యూఢిల్లీ: తదుపరి రాష్ట్రపతి ఎవరనే దానిపై బీజేపీ ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తున్నది. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ తెలిపింది. అదే సమయంలో కేంద్రంలోని ఎన్డీయే కూటమి ఉమ్మడి అభ్యర్థిగా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలన్న మిత్రపక్షం శివసేన ప్రతిపాదనను కూడా బీజేపీ తోసిపుచ్చింది.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రతిపక్షాలు ఇప్పటికే ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ విషయమై అజ్‌తక్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బదులిచ్చారు. అభ్యర్థి ఎవరనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు అనేదానిపై తాను మనస్సులో ఏమనుకుంటున్నప్పటికీ.. ఈ విషయంపై మొదట పార్టీలో చర్చ జరగాలని, ఆ తర్వాత అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. ఆరెస్సెస్ చీఫ్ భగవత్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాలనే ప్రతిపాదనను ఇప్పటికే బీజేపీ తిరస్కరించిన విషయాన్ని షా మరోసారి గుర్తుచేశారు.