బాలీవుడ్ నటికి, బీజేపీ నాయకురాలికి వేధింపులు
Published Sat, Mar 4 2017 8:11 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM
ముంబై:
ఇద్దరు ప్రముఖ మహిళలకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. వారిలో ఒకరు బాలీవుడ్ నటి కాగా.. మరొకరు బీజేపీలో ప్రముఖ నాయకురాలు. కొంతకాలంగా వేధింపులను భరిస్తూ వచ్చిన వాళ్లిద్దరూ చివరకు పోలీసులను ఆశ్రయించారు. బాలీవుడ్‌లో అలనాటి కలల రాణి సోనూ వాలియాను గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌లో వేధిస్తున్నాడు. దీనిపై ఆమె ముంబైలోని బంగూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఐపీసీ సెక్షన్ 354 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఖూన్ భరీ మాంగ్ లాంటి చిత్రాల్లో హాట్‌గా నటించిన సోను వాలియా (53), ఇప్పుడు ముంబైలోని మలాడ్ ప్రాంతంలో నివసిస్తున్నారు. అతడు తనకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడటంతో పాటు అసభ్య వీడియోలు కూడా పంపుతున్నాడని వాలియా తెలిపారు. దాదాపు వారం రోజుల నుంచి కొనసాగుతున్న ఈ వేధింపులు ఏమాత్రం తగ్గకపోవడంతో ఇక పోలీసులను ఆశ్రయించినట్లు ఆమె చెప్పారు. అతడిని తాను హెచ్చరించినా ఫలితం కనిపించలేదని, పైపెచ్చు అసభ్య ఫోన్ కాల్స్ మరింత పెరిగాయని అన్నారు. ఒక్కోసారి ఒక్కో నెంబరు నుంచి అతడు ఫోన్ చేస్తున్నాడని, అవేవీ ఇప్పుడు పనిచేయడం లేదని ఇన్‌స్పెక్టర్ శిరీష్ గైక్వాడ్ తెలిపారు.
బీజేపీ నాయకురాలికి కూడా...
ముంబై నగరానికే చెందిన ప్రముఖ బీజేపీ నాయకురాలు షైనా ఎన్‌సీకి కూడా వేధింపులు తప్పలేదు. తనకు ఒక వ్యక్త అసభ్యకరమైన సందేశాలు పంపుతూ వేధిస్తున్నాడని ఆమె పోలీసులను ఆశ్రయించారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ కూడా అయిన షైనా.. తనకు గత డిసెంబర్ నెల నుంచి ఆ వ్యక్తి వాట్సప్, ఎస్ఎంఎస్‌ల ద్వారా అసభ్య సందేశాలు పంపుతున్నాడని, అతడి వేధింపులు భరించలేక చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. ముంబై బీకేసీలోని సైబర్ క్రైం విభాగంలో ఆమె ఫిర్యాదు దాఖలు చేశారు. బీఎంసీ ఎన్నికల ప్రచారంలో బాగా బిజీగా ఉండటంతో ఇన్నాళ్ల పాటు పోలీసుల వద్దకు వెళ్లలేదన్నారు.
Advertisement
Advertisement