
ప్రియుడి వేధింపుల వల్లే మౌనిక ఆత్మహత్య
ఖమ్మం క్రైం: ఖమ్మం నగరంలో ఈనెల 9న జిల్లా ఆస్పత్రిలో అనుమానాస్పదంగా మృతి చెందిన మౌనిక కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. పెళ్లి చేసుకుందామని ప్రియుడు వేధించడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు డీఎస్పీ దక్షిణామూర్తి శనివారం వివరించారు. చండ్రుగొండ మండలం దుబ్బతండాకు చెందిన భూక్యా మౌనిక (19) నగరంలోని మహిళా డిగ్రీ కళాశాలలో చదువుతూ మామిళ్లగూడెంలోని స్వధార్‌హోంలో ఉంటోంది. ఆమెకు ఏడాది క్రితం కూసుమంచి మండలం నాయకన్‌గూడెంకు చెందిన దేశబోయిన గణేష్ అలియాస్ చందుతో(22)తో పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా గణేష్ పెళ్లి చేసుకొందామని మౌనికపై ఒత్తిడి తీసుకురాగా, ఆమె మాత్రం జీవితంలో స్థిరపడాలనీ, డిగ్రీ అయిపోయిన తర్వాత అంటూ వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో తరచూ వీరి మధ్య గొడవలు జరిగేవి.
అసలేం జరిగింది..: ఈనెల 8న సాయంత్రం గణేష్ మౌనిక ఉంటున్న హోంకు వెళ్లి గొడవ పడ్డాడు. రోడ్డు మీదనే ఆమెను చెంపమీద కొట్టాడు. ఆదివారం మధ్యాహ్నం ప్రశాంత్‌నగర్‌లోని గణేష్ గదికి మౌనిక వెళ్లింది. అక్కడ వీరిద్దరి మధ్య మరోసారి పెళ్లి విషయం తీవ్రంగా ఘర్షణ జరగడంతో గణేష్ ఆమెపై చేయి చేసుకున్నాడు. దీంతో ఆమె చనిపోతానంటూ గోడకు తల కొట్టుకుంది. ఫ్యాన్‌కు తన చున్నీతో ఉరి వేసుకుంది. వెంటనే ఆమెను కిందకు దించి ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ తన స్నేహితుడైన ఆటో డ్రెవర్‌ను సహాయం అడగగా, అతను స్టేచర్ తీసుకుని వచ్చాడు.
అతనే గణేష్‌తో పాటు సీసీ టీవీ పుటేజ్‌లలో కనిపించిన యువకుడని, అతనికి ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని పోలీసులు తెలిపారు. టూటౌన్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలించారు. నల్లగొండ జిల్లా మేళ్ల చెర్వు ప్రాంతంలో గణేష్ తండ్రి చేపలు పట్టడానికి వెళ్లగా, ఆస్పత్రి నుంచి గణేష్ నేరుగా అక్కడికే వెళ్లాడు. అతని సెల్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా పోలీసులు వెళ్లి అతని అదుపులోకి తీసుకున్నారు.