
బ్రెజిల్ ను వణికిస్తున్న జికా వైరస్
పెర్నాంబుకొ: బ్రెజిల్ వాసులను జికా వైరస్ వణికిస్తోంది. దోమల ద్వారా వ్యాప్తి చెందే ఈ వైరస్ కారణంగా మెదడులో లోపాలతో పుడుతున్న శిశువుల సంఖ్య పెరుగుతుండడంతో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. జికా వైరస్ గా పిలవబడుతున్న వెస్ట్ నిలే వ్యాధికారకాన్ని 70 ఏళ్ల క్రితం ఆఫ్రికా అడవి కోతుల్లో తొలిసారి గుర్తించారు. దీని కారణంగా నాడీ సంబంధ రుగ్మతలు సంభవిస్తాయని, కొన్నిసార్లు మరణం సంభవించే అవకాశముందని బ్రెజిల్ ఆరోగ్య శాఖ తెలిపింది.
శుష్కించిన శిరస్సు(మైక్రోసెఫలే)తో జన్మించిన శిశువుల్లో జికా వైరస్ ను గుర్తించినట్టు వెల్లడించింది. ఇలాంటి శిశువులకు జన్మనిచ్చిన తల్లుల అపరాయు ద్రవంలోనూ ఈ వైరస్ ను కనుగొన్నట్టు తెలిపింది. జికా వైరస్ కారణంగా ప్రపంచ సైన్స్ పరిశోధనా రంగం మునుపెన్నడూ లేని క్లిష్గట పరిస్థితిని ఎదుర్కొంటోందని పేర్కొంది.
బ్రెజిల్ లో ఈ ఏడాది ఇప్పటివరకు 2400 మందిపైగా మైక్రోసెఫలే బారిన పడ్డారు. 29 మంది చనిపోయారు. గతేడాది 147 మైక్రోసెఫలే కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా పెర్నాంబుకొ రాష్ట్రంలో ఈ వ్యాధి ఎక్కువగా ఉంది. అయితే జికా వైరస్ వ్యాప్తిని ఏవిధంగా నిరోధించాలనే దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. అయితే దోమల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని విస్తృతంగా ప్రచారం చేస్తోంది. జికా వైరస్ ను వ్యాప్తి చేసే ఎడిస్ ఏజిప్టి దోమలను నియత్రించేందుకు ఇంటింటికీ దోమ నిర్మూలన బృందాలను పంపుతోంది.