
పరులను ముద్దు పెట్టుకోకండి!
బ్రసిల్లా: దక్షిణ అమెరికా దేశాలను వణికిస్తున్న జికా వైరస్ నోటి లాలాజలం (సలైవా) ద్వారా కూడా ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని వైద్య నిపుణుల తాజా పరిశోధనలో వెల్లడైంది. దీంతో మహిళలు, ముఖ్యంగా గర్భిణీలు తమకు తెలియని పరులను ముద్దాడ రాదంటూ బ్రెజిల్ వైద్యాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లైంగిక చర్య ద్వారా కూడా ఈ జికా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని తేలడంతో తప్పనిసరిగా కండోమ్స్‌ను వాడాలంటూ అమెరికా వైద్యాధికారులు తమ పౌరులకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.
జికా వైరస్ ఉధృతంగా ఉన్న బ్రెజిల్ దేశంలో జికా వైరస్ సోకిన రోగుల లాలాజలం, యూరిన్‌లలో జికా వైరస్ సజీవంగా ఉన్నట్టు తాజాగా తమ పరిశోధనలో వెల్లడైందని బ్రెజిల్ ప్రభుత్వ ఆరోగ్య సంస్థ ‘ఫియోక్రజ్’ తాజాగా ప్రకటించింది. రోగుల లాలాజలంలో జికా వైరస్ సజీవంగా ఉండడం వల్ల ఆ రోగి మరొకరిని ముద్దు పెట్టుకోవడం ద్వారా ఆ మరొకరికి కూడా ఈ వైరస్ సోకే అవకాశం ఉందని, అయితే ఈ విషయాన్ని వైద్య పరీక్షల ద్వారా ధ్రువీకరించుకోవాల్సి ఉందని ఫియోక్రజ్ వైద్యాధికారులు తెలిపారు.
దోమకాటు ద్వారా మనుషులకు వ్యాపించే జికా వైరస్ మానవుల రక్తంలోనే జీవనం సాగిస్తుందని, అది ఒక మనిషి నుంచి మరో మనిషికి సోకే అవకాశం లేదని ఇంతకాలం వైద్య నిపుణులు భావిస్తూ వచ్చారు. జికా వైరస్ సోకిన ఓ రోగి నుంచి తీసిన రక్తాన్ని ఎక్కించిన వ్యక్తికి కూడా వైరస్ సోకిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత మెక్సికో నగరానికి వెళ్లి అక్కడ సెక్స్‌లో పాల్గొని వచ్చిన అమెరికన్‌ను కూడా జికా వైరస్ సంక్రమించడంతో లైంగిక చర్యల ద్వారా కూడా ఈ వైరస్ సోకుతుందని వైద్యులు గ్రహించారు. ఇప్పుడు నోటి లాలాజలం ద్వారా కూడా సోకుతుందన్న విషయం కొత్తగా తేలింది.
మానవ శరీరాలు స్రవించే ద్రవాల ద్వారా ఇతరులకు ఈ జికా వైరస్ సోకుతుందా, లేదా? అన్న విషయాన్ని ధ్రువీకరించేందుకు తాము పరిశోధనలు జరుపుతున్నామని, ముందు జాగ్రత్తగా రోగుల మంచాలకు, కంచాలకు దూరంగా ఉండాలని దేశ ప్రజలను బ్రెజిల్ వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. బ్రెజిల్‌లో ప్రస్తుతం 3,700 మంది జికా వైరస్ బారిన పడగా, అమెరికాలో 30 మంది ఈ వైరస్‌తో బాధ పడుతున్నారు.