ఐదో రోజూ డౌన్
రిజర్వుబ్యాంక్ పరపతి విధానాన్ని వెల్లడించనున్న నేపథ్యంలో మార్కెట్లో లాభాల స్వీకరణ ఫలితంగా బీఎస్‌ఈ సెన్సెక్స్ వరుసగా ఐదో రోజు క్షీణించింది. అధిక వడ్డీ రేట్లతో సతమతమయ్యే బ్యాంకింగ్, రియల్టీ షేర్లతో పాటు మెటల్, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు జరిగాయి. సోమవారం ఆసియా మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడ్‌కావడంతో సెన్సెక్స్ తొలుత 20,771 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగింది.
తదుపరి హఠాత్తుగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో 113 పాయింట్లు నష్టపోయి 20,570 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 44 పాయింట్ల క్షీణతతో 6,101 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అక్టోబర్ డెరివేటివ్ సిరీస్ మరో మూడు రోజుల్లో ముగియనుండటం కూడా మార్కెట్లో హెచ్చుతగ్గులకు కారణమని ఆ వర్గాలు తెలిపాయి. బ్యాంకింగ్ షేర్లు ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లు 2-5 శాతం మధ్య తగ్గాయి. బీఎస్‌ఈలో టర్నోవర్ రూ. 1,744 కోట్ల నుంచి రూ. 1,685 కోట్లకు తగ్గగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో టర్నోవర్ రూ. 9,820 కోట్ల నుంచి రూ. 8,917 కోట్లకు క్షీణించింది.
నిఫ్టీ కాంట్రాక్టులో లాంగ్ రోలోవర్స్: ఈ నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టులు వచ్చే గురువారం ముగియనున్నందున, అక్టోబర్ నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టులో భారీగా బుల్ ఆఫ్‌లోడింగ్ జరిగింది. కానీ అదే సమయంలో నవంబర్ కాంట్రాక్టులో అంతకంటే స్పీడుగా లాంగ్ రోలోవర్స్ జరిగాయి. మంగళవారం మధ్యాహ్నం రిజర్వుబ్యాంక్ పరపతి విధానం వెల్లడైన తర్వాత మార్కెట్లో హెచ్చుతగ్గుల తీవ్రత పెరిగితే అక్టోబర్ పొజిషన్‌ను నవంబర్‌కు రోలోవర్ చేయడం కష్టమనే భావనతో ముందుగానే ఇన్వెస్టర్లు రోలోవర్ ప్రక్రియను వేగవంతం చేసినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.