కొనసాగిన లాభాల స్వీకరణ
మార్కెట్లో శుక్రవారం వరుసగా రెండోరోజు లాభాల స్వీకరణ కొనసాగింది. ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ దీనికి కారణమని మార్కెట్ వర్గాలు తెలిపాయి. చైనా కేంద్ర బ్యాంకు లిక్విడిటీని కట్టడి చేస్తున్నదన్న భయాలు, జపాన్ తగినంతగా వృద్ధి సాధించబోదన్న అంచనాలతో ప్రధాన ఆసియా మార్కెట్లు సైతం పడిపోయాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 42 పాయింట్ల నష్టంతో 20,683 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సూచి 19 పాయింట్ల క్షీణతతో 6,145 పాయింట్ల వద్ద క్లోజయిఅయంది.
నిఫ్టీ కాంట్రాక్టులో కాల్ బిల్డప్....
మరో నాలుగురోజుల్లో అక్టోబర్ డెరివేటివ్ కాంట్రాక్టులు ముగియనున్నందున, శుక్రవారం నిఫ్టీతో పాటు పలు బ్లూచిప్ ఫ్యూచర్ కాంట్రాక్టుల్లో పెద్ద ఎత్తున లాంగ్ ఆఫ్‌లోడింగ్ జరిగింది. ఈ కారణంగా నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) నుంచి 11 లక్షల షేర్లు కట్ అయ్యాయి. ఈ నెలలో 7 శాతంపైగా ర్యాలీ జరిపినందున లాంగ్ పొజిషన్ల నుంచి ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించినట్లు ఈ ట్రెండ్ సూచిస్తోంది. అయితే 6,200 స్ట్రయిక్ వద్ద భారీగా కాల్ బిల్డప్ జరిగింది. ఈ కాల్ ఆప్షన్ ఓఐలో 9.14 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. మొత్తం ఓఐ 55 లక్షల షేర్లకు చేరింది. ఇదే స్ట్రయిక్ వద్ద పుట్ కవరింగ్ జరగడంతో ఈ పుట్ ఆప్షన్ నుంచి 5.21 లక్షల షేర్లు కట్ అయ్యాయి. 6,100, 6,000 స్ట్రయిక్స్ వద్ద పుట్ రైటింగ్ జరిగింది. ఈ ఆప్షన్ల ఓఐలో వరుసగా 1,40 లక్షలు, 4.85 లక్షల షేర్ల చొప్పున యాడ్ అయ్యాయి. ఆర్‌బీఐ పాలసీ నిర్ణయం వెలువడేంతవరకూ నిఫ్టీ 6,200 స్థాయిని దాటకపోవొచ్చని, ప్రతికూల వార్త ఏదైనా ఎదురైతే భారీ పుట్ రైటింగ్ జరిగిన 6,000 స్థాయి (62 లక్షల షేర్ల పుట్ బిల్డప్) మద్దతునివ్వవచ్చని డేటా వెల్లడిస్తున్నది. అలాగే నిఫ్టీని నియంత్రించే ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ కాంట్రాక్టుల్లో కూడా భారీ కాల్ రైటింగ్ జరిగింది. రిలయన్స్ రూ. 900 స్ట్రయిక్ కాల్ ఆప్షన్ ఓఐలో బిల్డప్ 11.46 లక్షల షేర్లకు చేరింది. ఐటీసీ రూ. 350 స్ట్రయిక్ కాల్ ఆప్షన్ ఓఐలో తాజాగా 5,77 లక్షల షేర్లు యాడ్‌కాగా, మొత్తం ఓఐ 15.36 లక్షల షేర్లకు పెరిగింది.
సమీప భవిష్యత్తులో ఈ షేర్లు ఆ స్థాయిల్ని అధిగమించడం కష్టసాధ్యమని ఈ బిల్డప్ సూచిస్తున్నది. ఫలానా స్థాయిని మించి షేరు పెరగదన్న అంచనాలతో కాల్ ఆప్షన్‌ను, లేదా తగ్గదన్న అంచనాలతో పుట్ ఆప్షన్‌ను విక్రయించడాన్ని ఆప్షన్ రైటింగ్‌గా వ్యవహరిస్తారు. వారి అంచనాలకు తగ్గట్లు షేరు పెరగకపోతే కాల్ ఆప్షన్ ప్రీమియం, తగ్గకపోతే పుట్ ఆప్షన్ ప్రీమియం తగ్గిపోతుంది. ఎక్కువ ప్రీమియంకు విక్రయించిన ఆప్షన్ కాంట్రాక్టును ప్రీమియం తగ్గిన తర్వాత కొంటే, అమ్మకం కొనుగోలు ధర మధ్య వ్యత్యాసం లాభంగా మిగులుతుంది. అంచనాలకు భిన్నంగా ప్రీమియం పెరిగితే ఆప్షన్లు రైట్ చేసినవారు నష్టపోతారు. అలా రైట్ చేసిన కాంట్రాక్టులను కొన్నవారు లాభపడతారు.