2 రోజుల్లో 1000పాయింట్లు లాస్ | BSE Sensex loses 1000 pts in 2 days | Sakshi
Sakshi News home page

2 రోజుల్లో 1000పాయింట్లు లాస్

Published Tue, Aug 20 2013 2:19 AM | Last Updated on Fri, Sep 1 2017 9:55 PM

2 రోజుల్లో 1000పాయింట్లు లాస్

2 రోజుల్లో 1000పాయింట్లు లాస్

 దేశం నుంచి తరలివెళ్లే విదేశీ కరెన్సీపై రిజర్వుబ్యాంక్, ప్రభుత్వం మరిన్ని నియంత్రణలు విధించవచ్చనే భయాలు పెరగడంతో వరుసగా రెండోరోజు స్టాక్ మార్కెట్ పతనమయ్యింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల అమ్మకాల స్పీడు కొనసాగడంతో సోమవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ మరో 291 పాయింట్లు పతనమయ్యింది. మరో రూ. లక్ష కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. వరుసగా రెండురోజుల్లో సూచీ 1000 పాయింట్లకుపైగా నష్టపోయింది. బ్యాంకులు, ఆటోమొబైల్స్, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లలో జరిగిన అమ్మకాల తాకిడికి ఒకదశలో 400 పాయింట్లకుపైగా నిలువునా కుప్పకూలిన సెన్సెక్స్ 18,139 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. ముగింపులో జరిగిన షార్ట్ కవరింగ్ ఫలితంగా చివరకు నాలుగు నెలల కనిష్టస్థాయి 18,307 పాయింట్ల వద్ద ముగిసింది.
 
 5,360 పాయింట్ల వద్దకు పతనమైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ చివరకు 93 పాయింట్ల నష్టంతో 11 నెలల కనిష్టస్థాయి 5,415 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మొత్తం 263 షేర్లు 52 వారాల కనిష్టస్థాయిని తాకాయి. బ్యాంకు షేర్లలో అమ్మకాల తీవ్రత ఎక్కువగా వుంది. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ షేర్లు 52 వారాల కనిష్టస్థాయికి పడిపోవడంతోపాటు 4-8 శాతం మధ్య క్షీణించాయి. ఆటో షేర్లు బజాజ్ ఆటో, టాటా మోటార్స్, మహీంద్రాలు 3-5 శాతం మధ్య తగ్గాయి. ఎఫ్‌ఎంసీజీ రంగానికి చెందిన హెచ్‌యూఎల్, ఐటీసీ, డాబర్ ఇండియాలు క్షీణించింది 2-3 శాతమే అయినా, మొదటి రెండు షేర్లకు సూచీల్లో వెయిటేజీ ఎక్కువగా ఉన్నందున, సెన్సెక్స్, నిఫ్టీల భారీ నష్టాలకు కారణమయ్యాయి. ఫార్మా షేర్లు సన్ ఫార్మా, సిప్లాలు 3-4 శాతం పడిపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) రూ. 680 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించారు. దేశీయ సంస్థలు రూ. 372 కోట్ల విలువైన నికర కొనుగోళ్లు జరిపాయి. ఈ రెండు రోజుల్లో ఎఫ్‌ఐఐలు క్యాష్ మార్కెట్లో రూ. 1,200 కోట్ల నికర అమ్మకాలు జరపగా, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మార్కెట్లో భారీ స్థాయిలో షార్ట్ చేసినట్లు డెరివేటివ్ డేటా వెల్లడిస్తున్నది.
 
 60 లక్షల కోట్ల దిగువకు మార్కెట్ క్యాప్
 వరుసగా రెండో రోజూ అమ్మకాలు వెల్లువెత్తడంతో భారత్ స్టాక్ మార్కెట్లో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ (మార్కెట్ క్యాప్) 60 లక్షల కోట్లలోపునకు జారిపోయింది. డాలరు రూపేణా ఇప్పటికే ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను వదులుకున్న స్టాక్ మార్కెట్ సోమవారం 947 బిలియన్ డాలర్లకు (రూ.59,80,065 కోట్లు) దిగింది. ఈ రెండు రోజుల్లో సెన్సెక్స్ 1,000 పాయింట్లకుపైగా క్షీణించగా, రూపాయి 63.13 స్థాయికి పడిపోయింది. ట్రిలియన్ డాలర్ల క్లబ్ నుంచి ఆగస్టు 6న వైదొలగిన భారత్ మార్కెట్ తిరిగి ఆగస్టు 8న ఆ మార్క్‌ను అందుకున్నప్పటికీ, రూపాయి క్రమేపీ క్షీణించడం, షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనుకావడంతో ఆ స్థాయిని వదులుకోవాల్సివచ్చింది. 2007 జూన్‌లో భారత్ తొలిసారిగా ట్రిలియన్ డాలర్ల క్లబ్‌లో ప్రవేశించింది. అమెరికా ఆర్థిక సంక్షోభ ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు పతనం కావడంతో 2008 సెప్టెంబర్‌లో ఆ మార్క్‌ను కోల్పోయింది. తిరిగి 2009 మే నెలలో మార్కెట్ క్యాప్ ట్రిలియన్ డాలర్లకు చేరి, అప్పుడప్పుడు ఒకటి, రెండు రోజులు మినహా ఆ క్లబ్‌లో కొనసాగింది. ఈ లీగ్‌లోంచి ఇండియా వైదొలగడంతోఅమెరికా, బ్రిటన్, జపాన్, చైనా, హాంకాంగ్, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాలతో సహా డజను ప్రధాన మార్కెట్లు ప్రస్తుతం ట్రిలియన్ డాలర్లకు మించి మార్కెట్ క్యాప్‌తో ట్రేడవుతున్నాయి.  
 
పెరిగిన షార్ట్స్
 రానున్న కొద్దిరోజుల్లో లార్జ్‌క్యాప్ షేర్లలో మరిన్ని అమ్మకాలు జరగవచ్చనడానికి సంకేతంగా సోమవారం నిఫ్టీలో మరిన్ని షార్ట్ పొజిషన్లు యాడ్ అయ్యాయి. శుక్రవారం నిఫ్టీ ఆగస్టు ఫ్యూచర్ కాంట్రాక్టులో 18 శాతం ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) పెరగ్గా, సోమవారం ఓఐలో తాజాగా 15.67 లక్షల షేర్లు (8.89 శాతం) యాడ్‌కావడంతో మొత్తం ఓఐ 1.92 లక్షల షేర్లకు పెరిగింది. ధర తగ్గుతూ ఓఐ యాడ్ అయితే, లాంగ్ పొజిషన్లకంటే షార్ట్ పొజిషన్లు ఎక్కువగా వున్నాయనడానికి సూచన. 5,500, 5,400 స్ట్రయిక్స్ వద్ద కాల్ రైటింగ్ జరగడంతో ఈ ఆప్షన్స్ ఓఐలో వరుసగా 14.36 లక్షలు, 33.38 లక్షల షేర్ల చొప్పున యాడ్ అయ్యాయి. శుక్రవారం ట్రేడింగ్ ముగింపు సమయానికి భారీ ఓఐ కలిగిన 5,400 స్ట్రయిక్ పుట్ ఆప్షన్ కాంట్రాక్టుల్లో ఈ సోమవారం భారీగా కవరింగ్ జరిగింది. దాంతో ఈ కాంట్రాక్టు నుంచి 19.22 లక్షల షేర్ల ఓఐ కట్ అయ్యింది. 5,500 స్ట్రయిక్ వద్ద కూడా పుట్ కవరింగ్ ఫలితంగా ఓఐ నుంచి 12.15 లక్షల షేర్లు కట్ అయ్యాయి. అయితే 5,300 స్ట్రయిక్ పుట్ ఆప్షన్లో పుట్ రైటింగ్ జరగడంతో 17 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి.  అలాగే బ్యాంక్ నిఫ్టీలో జోరుగా షార్ట్ సెల్లింగ్ జరిగింది. దాంతో బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ ఓఐలో తాజాగా 2.26 లక్షల షేర్లు (9.32 శాతం) యాడ్‌కావడంతో మొత్తం ఓఐ 26.54 లక్షల షేర్లకు చేరింది. సమీప భవిష్యత్తులో నిఫ్టీ మరింత క్షీణిస్తుందన్న అంచనాలతో ఫ్యూచర్ కాంట్రాక్టును విక్రయించడాన్ని షార్ట్ సెల్లింగ్‌గా వ్యవహరిస్తారు. ఫలానా స్థాయిని మించి నిఫ్టీ పెరగదన్న అంచనాలు వుంటే ఆ స్ట్రయిక్ వద్ద కాల్ రైటింగ్ చేయడం, ఫలానా స్థాయికంటే తగ్గదని భావిస్తే ఆ స్ట్రయిక్ వద్ద పుట్ ఆప్షన్లను విక్రయిస్తారు (పుట్ రైటింగ్).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement