లక్నో: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. దేశంలోని ఏ ఒక్క ఇతర పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. ఆమె శనివారం లక్నోలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ లేదా బీజేపీతో బయటినుంచి లేదా అంతర్గతంగా పొత్తు పెట్టుకుంటుందంటూ వస్తున్న వార్తలన్నీ వదంతులేనని పేర్కొన్నారు. బీఎస్పీని అభిమానించే ప్రజలను తప్పుదోవ పట్టించడం, పార్టీని దెబ్బతీయడం లక్ష్యంగా ఇలాంటి వార్తలను వ్యాపింపజేస్తున్నారని ఆరోపించారు.
రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ చక్కని ఫలితాలను సాధిస్తుందని విశ్వాసం వెలిబుచ్చారు. ఒకరినొకరు దెబ్బతీసుకునేందుకు బీజేపీ నేతలు ఎల్‌కే అద్వానీ, నరేంద్ర మోడీ, రాజ్‌నాథ్‌సింగ్‌లు చేస్తున్న ప్రయత్నాలు బీఎస్పీ తన లక్ష్యాన్ని సాధించేందుకు తోడ్పడగలవని చెప్పుకొచ్చారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో తమ పార్టీ నంబర్‌వన్‌గా నిలుస్తుందని గట్టి నమ్మకం వెలిబుచ్చారు. ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తోందని చెబుతూ.. త్వరలో ఈ రాష్ట్రాల్లో పర్యటించనున్నట్టు ప్రకటించారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరి పోటీ
Published Sun, Nov 10 2013 2:09 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement