కాంగ్రెస్‌కు ఓటేయొద్దు
Published Sat, Apr 5 2014 11:19 PM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
ఘజియాబాద్ : దేశ రాజకీయాల నుంచి కనుమరుగైపోతున్న కాంగ్రెస్ పార్టీకి ఓటే యొద్దని బీఎస్పీ అధినేత మాయావతి ముస్లింలకు విజ్ఞప్తి చేశారు. కవినగర్ ప్రాంతంలోని రామ్‌లీలా మైదానంలో శనివారం జరిగిన బీఎస్పీ ర్యాలీలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో కాంగ్రెస్ పరిస్థితి నానాటికి దిగదిడుపుగా మారిన నేపథ్యంలో ఆ పార్టీకి ఓటేయడమంటే దాన్ని వృథా చేసుకున్నట్లేనని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ముస్లింలందరూ కాంగ్రెస్‌కే మద్దతు తెలపాలని జామా మసీద్‌కు చెందిన షాహీ ఇమామ్ రెండు రోజుల కిందట ప్రకటించిన నేపథ్యంలో మాయావతి వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తించాయి. ఈ సందర్భంగా ఇమామ్ మాట్లాడుతూ స్థానిక పార్టీలకు ఓటేస్తే ఉపయోగం ఉండదని, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌కు మాత్రమే ఓటేయండని స్పష్టం చేశారు. బీఎస్పీని అవకాశవాద పార్టీగా ఆయన అభివర్ణించారు.
కాగా, తన పార్టీ ర్యాలీలో మాయావతి మాట్లాడుతూ ఇమామ్ వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించారు. ‘ఒక్క ఉత్తర్‌ప్రదేశ్‌లోనే కాదు.. దేశమంతటా కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉంది.. కాబట్టి ఆ పార్టీకి ఓటేసి వృథా చేయొద్దు..’ అని మాయావతి కోరారు. ఒక్క కాంగ్రెస్‌కే కాదు.. బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీలకు సైతం ఓటేయొద్దని ఆమె పిలుపునిచ్చారు. ఘజియాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన రాజ్‌బబ్బర్‌కు కనీసం డిపాజిట్ కూడా దక్కకుండా చూడాలన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చరిష్మాపై, బీజేపీ తమ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ చమక్కులపై ఆధారపడ్డాయని ఆమె ఎద్దేవా చేశారు. 2002 గోధ్రా అల్లర్లపై ఇప్పటికీ సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి(నరేంద్ర మోడీ)ని బీజేపీ తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం ఆ పార్టీ దివాళకోరుతనానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు తమ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరన్నది ప్రకటించకపోయినా అది ఎవరనేది బహిరంగ రహస్యమేనని ఆమె ఎద్దేవా చేశారు. బీజేపీని అధికారంలోకి రాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే తిరిగి మతకల్లోలాలు జరిగే ప్రమాదముందని ఆమె హెచ్చరించారు.
ఈ ఎన్నికల్లో బీఎస్పీకి దళితులు, ముస్లింలు, బ్రాహ్మణులు, సిక్కులు మద్దతు ఇవ్వాలని మాయావతి విజ్ఞప్తి చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న ఆరేళ్ల కాలంలో ఉత్తర్‌ప్రదేశ్ అభివృద్ధికి ఆ పార్టీ చేసింది శూన్యమని ఆమె ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ విభజనకు అనుకూలంగా బీఎస్పీ ఎప్పుడో లేఖ ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దెబ్బతిందని, సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం పనితీరు అధ్వానంగా ఉందని ఆమె దుయ్యబట్టారు. ముజఫరాబాద్, షామ్లీ అల్లర్లే దీనికి నిదర్శనమని ఆమె ఉదహరించారు. పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లో అభివృద్ధికి ఎస్పీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదన్నారు. బీఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చామన్నారు.
Advertisement
Advertisement