జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్న మాయ, మమత, జయ
మాయావతి, జయలలిత, మమత బెనర్జీ.. ఈ ముగ్గురు దేశ రాజకీయాల్లో మహిళాశక్తికి ప్రతీకలు. పురుషాధిక్య రాజకీయాలను తట్టుకుని, పోరాడి, గెలిచి, వాటిని శాసిస్తున్న ధీశాలులు. ముగ్గురివి వేర్వేరు నేపథ్యాలు.. వేర్వేరు మనస్తత్వాలు.. వేర్వేరు పంథాలు. కానీ రాజకీయాల్లో వారు వేసిన ముద్ర ఒకటే. ప్రజల మనసుల్లో వారు సంపాదించిన స్థానం ఒకటే. ప్రస్తుత ఎన్నికల అనంతరం కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడనుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. తమ రాష్ట్రాల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుని ప్రభుత్వ ఏర్పాటులో, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ముగ్గురూ సిద్ధమవుతున్నారు. అవకాశం లభిస్తే ప్రధాని పదవికి కూడా తాము అర్హులమేనని స్పష్టం చేస్తున్నారు. - ఎలక్షన్ సెల్
బెహన్‌జీ.. మాయావతి!
ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ప్రతిష్ట క్రమంగా మసకబారుతున్న పరిస్థితుల్లో బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉంది. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఏడాది ముందే లోక్‌సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పలు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశంతో వ్యూహాలు రూపొందించారు. తన 58వ పుట్టినరోజు నాడు లక్నోలో 10 లక్షల మందితో భారీ సభను నిర్వహించి సత్తా చాటారు.
2009లో యూపీలోని 80 స్థానాలకు గానూ బీఎస్పీ గెలుచుకున్నది 20 స్థానాలు (ఒక స్థానం మధ్యప్రదేశ్ నుంచి) కాగా, రానున్న ఎన్నికల్లో 25 నుంచి 30 సీట్లలో గెలుపొందాలని మాయావతి లక్ష్యంగా పెట్టుకున్నారు. ముజఫర్‌నగర్ అల్లర్లతో ఎస్పీ ముస్లింలకు దూరమైంది. ఆ ఓట్లు కూడా తమ ఖాతాలోకే అన్న నమ్మకంతో మాయావతి ఉన్నారు. కేంద్రంలో తమ పార్టీ మద్దతు లేకుండా ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉండాలని భావిస్తున్నారు. అవకాశం లభిస్తే మొదటి దళిత మహిళా ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. పార్టీ ప్రారంభం నుంచీ తమకు మద్దతుగా నిలిచిన దళిత, బహుజన, మైనారిటీలతో పాటు బ్రాహ్మణుల ఓట్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
పురచ్చితలైవి.. జయలలిత!
దేశప్రధాని కావాలన్న తన ఆశయాన్ని స్పష్టంగా, నిర్మొహమాటంగా వ్యక్తపరిచిన జయలలిత.. ఆ దిశగా తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తమిళనాడులో అత్యధిక లోక్‌సభ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ‘అమ్మ’ మనసు తెలుసుకున్న పార్టీ నేతలు ఇప్పటికే ’ప్రధానమంత్రి పురచ్చితలైవి.. అమ్మ జయలలిత’ అంటూ బ్యానర్లు, హోర్డింగ్‌లతో హోరెత్తిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా తన పనితీరుపై ఎలాంటి అసంతృప్తీ ప్రారంభం కాకపోవడం జయలలితకు కలిసొచ్చే అంశం.
2009 సార్వత్రిక ఎన్నికల్లో ఆమె పార్టీ అన్నా డీఎంకే తొమ్మిది స్థానాలు మాత్రమే గెల్చుకుంది. అంతర్గత కుమ్ములాటలు, అవినీతి ఆరోపణలతో ఆమె ప్రత్యర్థి పార్టీ డీఎంకే డీలా పడడంతో ఈ ఎన్నికల్లో మొత్తం 39 లోక్‌సభ స్థానాల్లో కనీసం 36 సీట్లు గెలుపొందాలని జయలలిత లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే ఏ పార్టీతోనూ పొత్తులకు వెళ్లడం లేదు. ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు వ్యూహాత్మకంగా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై మాత్రం జయలలిత ఎలాంటి విమర్శలు చేయడం లేదు.
దీదీ.. మమతా బెనర్జీ!
‘కేంద్రంలో వచ్చే ప్రభుత్వాన్ని మనమే నిర్ణయిద్దాం’ ఇదీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన కార్యకర్తలకు ఇస్తున్న సందేశం. దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో ఒకటైన పశ్చిమబెంగాల్‌ను పాలిస్తున్న దీదీ.. తన తదుపరి లక్ష్యం ఢిల్లీ పీఠమేనని అన్యాపదేశంగా చెబుతున్నారు. 2011లో అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్‌ఫ్రంట్‌పై ఘనవిజయం, పార్టీకి పెరిగిన ఓట్లశాతం విజయంపై ఆమె నమ్మకాన్ని బలపరుస్తున్నాయి. ప్రధాని పదవి సాధ్యంకాని పక్షంలో తదుపరి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించాలని భావిస్తున్నారు.
పార్లమెంటులో మన సంఖ్య పెరిగితేనే బెంగాల్‌పై వివక్ష అంతమవుతుంది అంటూ బెంగాలీ ఓటర్లకు గాలమేస్తు న్నారు. పశ్చిమబెంగాల్‌లోని 42 స్థానాలు సహా మొత్తం 10 రాష్ట్రాల్లో అభ్యర్థులను నిలపాలనుకుంటున్నారు. కనీసం 35 స్థానాలతో లోక్‌సభలో అడుగుపెట్టాలన్న లక్ష్యంతో మమత పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో అవసరమైతే బీజేపీతో కూడా కలిసి మమత పనిచేస్తారని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. అయితే అలా చేస్తే రాష్ట్రంలోని ఓటర్లలో 30 శాతం వరకు ఉన్న ముస్లిం ఓట్లను పణంగా పెట్టాల్సి రావచ్చు. 2009లో తృణమూల్ గెలుచుకున్నది 19 స్థానాలు. ఇప్పుడా సంఖ్యను 32 నుంచి 35 చేయాలన్న లక్ష్యంతో మమత కృషి చేస్తున్నారు.
ముగ్గురమ్మలు...
Published Sat, Mar 22 2014 1:18 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement