10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆయనే!
10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆయనే!
Published Wed, Feb 1 2017 9:50 AM | Last Updated on Tue, Sep 5 2017 2:39 AM
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ ఎంతో ప్రతిష్టాత్మకమైన బడ్జెట్ను నేడు పార్లమెంట్ ముందుకు తీసుకురాబోతున్నారు. 92 ఏళ్ల సంప్రదాయానికి స్వస్తి పలికి రైల్వే పద్దును, సాధారణ బడ్జెట్లో విలీనం చేసి దీన్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ గురించి పలు ఆసక్తికర విషయాలు....
భారత తొలి బడ్జెట్ : జేమ్స్ విల్సన్ తొలిసారి ఇండియన్ బడ్జెట్ను 1860 ఏప్రిల్లో ప్రవేశపెట్టారు. అప్పుడు విల్సన్ ఇండియన్ కౌన్సిల్కు ఆర్థికమంత్రిగా పనిచేసేవారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన కొన్నిరోజులకే ఆయన కన్నుమూశారు.
స్వతంత్ర భారతంలో తొలి బడ్జెట్ : స్వతంత్ర భారతంలో ఆర్కే షణ్ముఖం శెట్టి మొట్టమొదటి బడ్జెట్ను సభ ముందుకు తీసుకొచ్చారు. 1947 నవంబర్లో ఆయన దేశీయ తొలి ఆర్థికమంత్రి. 1947 ఆగస్టు 15 నుంచి 1948 మార్చి 31 వరకున్న కాలాన్ని ఈ బడ్జెట్ కవర్ చేసింది. ఆ తర్వాత మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
బడ్జెట్ చదవని మంత్రి : శెట్టి తర్వత 1949-50లో జాన్ మతాయి ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యంత సాదాసీదా బడ్జెట్గా పేరుగాంచింది. బడ్జెట్ను చదవకూడదని నిర్ణయించిన ఆయన, అన్ని వివరాలను వైట్ పేపర్లలో సర్క్యూలేట్ చేస్తున్నట్టు సభ్యులకు చెప్పారు.
10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆయనే : ఆర్థికమంత్రి నుంచి ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన మోరార్జీ దేశాయ్ ఎక్కువ సార్లు బడ్జెట్ను పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చారు. గరిష్టంగా 10 సార్లు ఆయన బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 1964, 1968 సంవత్సరాల్లో రెండుసార్లు ఆయన బర్త్డే రోజే బడ్జెట్ను తీసుకురావడం విశేషం. ఫిబ్రవరి 29న మోరార్జీ దేశాయ్ బర్త్డే.
బ్లాక్ బడ్జెట్ : రూ. 550 కోట్ల లోటు కారణంగా 1973-1974 కాలంలో తీసుకొచ్చిన బడ్జెట్కు బ్లాక్ బడ్జెట్గా పేరు. దీన్ని మాజీ ఆర్థికమంత్రి పీ. చిదంబరం ప్రవేశపెట్టారు.
బడ్జెట్ ప్రవేశపెట్టిన రాష్ట్రపతులు : ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ రాష్ట్రపతి ఆర్ వెంకటరామన్లు మాత్రమే ఆర్థికమంత్రులుగా ఉన్నప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనంతరం వీరు రాష్ట్రపతులయ్యారు.
క్లిష్ట పరిస్థితుల్లో బడ్జెట్ : అత్యంత క్లిష్ట పరిస్థితుల సమయంలో రెండు ప్రభుత్వ హయాంలో యశ్వంత్ సిన్హా ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టారు. పోఖ్రాన్ రెండవ పేలుళ్ల అనంతరం 1999లో, కార్గిల్ యుద్ధం అనంతరం 2000లో, గుజరాత్లో అత్యంత భీకరమైన భూకాపం అనంతరం 2001లో, ఫారెక్స్ సంక్షోభ సమయం 1991లో యశ్వంత్ సిన్హా బడ్జెట్ ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు.
ఇప్పటివరకు ఒకే ఒక్క మహిళే : ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్క మహిళ బడ్జెట్ ప్రవేశపెట్టారు. దేశాయ్ రాజీనామా చేయడంతో దివంగత ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న 1970-71 సమయంలో ఆమె బడ్జెట్ను పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చారు.
రెండు బడ్జెట్ల విడిపోయిన కాలం: 1924లో రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్ నుంచి విడదీశారు. అప్పటి నుంచి రెండు బడ్జెట్లు విడివిడిగా పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చారు. ఆ 92 ఏళ్ల సంప్రదాయానికి స్వస్తి పలికి , ప్రస్తుతం రెండు బడ్జెట్లను కలిపి మోదీ ప్రభుత్వం ప్రవేశపెడుతోంది.
బడ్జెట్ ప్రవేశపెట్టిన ముగ్గురు ప్రధానులు : ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీలు ప్రధానమంత్రులుగా దేశానికి సేవ చేస్తూనే బడ్జెట్ తీసుకొచ్చారు.
అతిపెద్ద బడ్జెట్ : 1991లో ప్రవేశపెట్టిన బడ్జెట్కు అతిపెద్ద బడ్జెట్గా పేరు. అదేసమయంలో దేశీయ ఆర్థిక విధానాలన్నింటిల్లో పూర్తి మార్పులు చోటుచేసుకున్నాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దీన్ని ప్రవేశపెట్టారు.
బడ్జెట్ సమయం మార్పులు : ముందు వరకు సాయంత్రం 5 గంటలకు బడ్జెట్ను పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చేవారు. కానీ ఎన్డీయే ప్రభుత్వం అటల్ బిహార్ వాజ్పేయి కాలం 1999లో బడ్జెట్ సమయాన్ని సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 11 గంటలకు తీసుకొచ్చారు. ఆ బడ్జెట్ను యశ్వంత్ సిన్హానే ప్రవేశపెట్టారు. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం కూడా బడ్జెట్ తేదీలనే మార్చేసి, ఒకనెల ముందుకు జరిపిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement