న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మన్మోహన్ సర్కారు కేంద్ర ప్రభుత్వోద్యోగులకు వల విసరనుంది. ఉద్యోగుల కరువు భత్యాన్ని (డీఏ) ప్రస్తుతమున్న 90 శాతం నుంచి 100 శాతానికి (10% పెంపు) పెంచనుంది. శుక్రవారం జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ ఎజెండాలో ఈ అంశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయం వల్ల సుమారు 50 లక్షల మంది ఉద్యోగులకు, 30 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. 2013 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో డీఏను 80 నుంచి 90 శాతానికి పెంచింది. తాజా పెంపును ఈ ఏడాది జనవరి 1 నుంచి అమలు చేయనుంది. డీఏ వరుసగా రెండంకెల మేర పెరగనుండటం ఇది రెండోసారి.