పీఎంవోలో ‘ప్యాకప్’ బిజీ..
న్యూఢిల్లీ: ఒకవైపు ఎన్నికల తతంగం చరమాంకానికి చేరుకుంటుండగా, ప్రధాని కార్యాలయం (పీఎంవో) ప్యాకింగ్ పనుల్లో తలమునకలుగా ఉంది. ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీకాలం మరో వారం రోజుల్లో ముగుస్తున్నందున ప్యాకింగ్ పనుల్లో తలమునకలుగా ఉన్నామని పీఎంవో అధికారి ఒకరు చెప్పారు. తన తర్వాత ఈ పదవి చేపట్టే వ్యక్తికి అంతా పద్ధతిగా అప్పగించాలని ప్రధాని మన్మోహన్ భావిస్తున్నారని ఆయన తెలిపారు. పుస్తకాలు, బహుమతులు, ఇతర వస్తువులన్నింటినీ జాగ్రత్తగా భద్రపరుస్తున్నామని వివరించారు. మన్మోహన్ ఈ ఏడాది ప్రారంభంలోనే తన రిటైర్మెంట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో 7 రేస్ కోర్సు రోడ్డులోని ప్రధాని అధికారిక నివాసంలో పదేళ్లుగా నివాసం ఉంటున్న ఆయన కుటుంబ సభ్యులంతా ఆయన రిటైర్మెంట్ తర్వాత 3 మోతీలాల్ నెహ్రూ మార్గ్‌లోని భవనానికి తరలి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇదివరకు ఆ భవనాన్ని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తన అధికారిక నివాసంగా ఉపయోగించుకున్నారు. ప్రధాని, పీఎంవో సభ్యులు అందుకున్న పెయింటింగ్‌లు, కళాకృతులు, జ్ఞాపికలు వంటి బహుమతులు, కానుకలు వంటివన్నీ ట్రెజరీలో భద్రపరచనున్నట్లు అధికారులు తెలిపారు.
17న ప్రధాని వీడ్కోలు ప్రసంగం: ప్రధాని మన్మోహన్ సింగ్ పదవి నుంచి వైదొలగే ముందు మే 17న జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గత పదేళ్ల తన పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ఆయన ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. లోక్‌సభ ఎన్నికలు మే 12 నాటితో ముగియనుండగా, మే 16న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కాగా, ప్రధాని తన మంత్రివర్గ సహచరులకు వీడ్కోలు విందు ఇవ్వనున్నట్లు సమాచారం.