ఈ ఎన్నికలు నిర్ణాయక ప్రధాని కోసమే
*నరేంద్ర మోడీ వ్యాఖ్య
*మన్మోహన్, సోనియాలపై విమర్శల దాడి
*జయ తన స్నేహితురాలని వెల్లడి
సాక్షి, చెన్నై/ఈరోడ్(తమిళనాడు): బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ.. ప్రధాని మన్మోహన్‌సింగ్ సహా కాంగ్రెస్ అధినాయకత్వంపై విమర్శల దాడిని తీవ్రం చేశారు. ‘ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు నిర్ణాయక శక్తి గల బాధ్యతాయుత ప్రధాని కోసం, తన ప్రభుత్వంలో తన మాటకు విలువ ఉన్న ప్రధాని కోసం జరుగుతున్నాయి’ అని వ్యాఖ్యానించారు.
యూపీఏ-2 హయాంలో మన్మోహన్‌ను కాంగ్రెస్ పార్టీ కోరలు పీకేసిన పాములా తయారు చేసిందని, ఆయన పార్టీ చీఫ్ సోనియా గాంధీకి తలొగ్గారన్న ఆయన మాజీ మీడియా సలహాదారు సంజయ్ బారు పుస్తకం ఆధారంగా మోడీ ఈ విమర్శలు సంధించారు.ఆయన గురువారం తమిళనాడులోనికన్యాకుమారి, ఈరోడ్‌లలో ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వమని మండిపడ్డారు. ‘కాంగ్రెస్‌కు 60 ఏళ్లు అధికారమిచ్చిన మీరు నాకు 60 నెలలు అధికారమిస్తే మీ భవిష్యత్తును మార్చేస్తా’నన్నారు.
తమిళనాడు జాలర్ల రక్షణకు యూపీఏ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని సోనియా బుధవారం కన్యాకుమారిలో చేసిన ప్రకటనపై మోడీ మండిపడ్డారు. జాలర్ల సమస్యలకు ఆమె చేసింది శూన్యమని, యూపీఏ ప్రభుత్వం జాలర్ల భద్రత పట్టించుకోకుండా నిద్రపోతోందని విమర్శించారు. ఈ అంశంపై ఆమె, తమిళనాడు సీఎం జయలలిత పరస్పర నిందలతో పొద్దుపుచ్చుతున్నారన్నారు.
కాగా జయ నేతృత్వంలోని అన్నాడీఎంకే లోక్‌సభ ఎన్నికల్లో మంచి పనితీరు కనబరుస్తుందని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో మోడీ ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి యత్నించారు. ‘జయ నాకు మంచి స్నేహితురాలు. పార్టీలు, సిద్ధాంతాలపరంగా విమర్శించుకోవడం తప్పుకాదు. అంతమాత్రాన శత్రువుగా చూడ్డం నా మనస్తత్వానికి విరుద్ధం’ అని ఈరోడ్‌లో విలేకర్లతో అన్నారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కూడా తనకు స్నేహితుడేనన్నారు.
గుజరాత్ అభివృద్ధి ఒక భ్రమ: జయ
జయలలిత.. మోడీపైతొలిసారిగా విమర్శలతో విరుచుకుపడ్డారు. అన్నాడీఎంకే తమిళనాడు ప్రజల బాగోగులను పట్టించుకోవడం లేదని మోడీ చేసిన విమర్శలను తిప్పికొట్టారు. గుజరాత్ అభివృద్ధి నమూనా ఒక భ్రమ అని, ఆ రాష్ట్రం దేశంలో నంబర్ వన్ అనడం నిజం కాదన్నారు.