బీజేపీ సిద్ధాంతాలు దేశవ్యతిరేకం
దేశాన్ని విభజిస్తూనే ఉంటుంది: ప్రధాని
పిలిభిత్: బీజేపీ ఎల్లప్పుడూ దేశాన్ని విభజిస్తూనే ఉంటుందని ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోపించారు. దేశ ఉమ్మడి సంస్కృతికి ఆ పార్టీ సిద్ధాంతాలు వ్యతిరేకమని ఆయన చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో శనివారం జరిగిన సభలో ప్రధాని ప్రసంగించారు. సోనియా, రాహుల్ గాంధీ మాదిరిగానే ప్రధాని కూడా బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు.
బీజేపీ నేతలు మతపరమైన అంశాల ఆధారంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారని... కానీ, జాతీయ అంశాలపై మనమంతా దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. దేశాన్ని ఎప్పుడూ విభజించే పార్టీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఉండాలా? అన్నదే ఈ సారి అతిపెద్ద అంశమని చెప్పారు. యూపీలో ఒక మతాన్ని మరో మతం వారు గౌరవించే ఉమ్మడి సంస్కృతి ఉందని, దానికి వ్యతిరేకంగా బీజేపీ పనిచేస్తోందన్నారు. పోలింగ్ ప్రారంభమైన తర్వాత బీజేపీ తన మేనిఫెస్టో విడుదల చేయడాన్ని చూస్తే... తమ విధానాలను ప్రజల ముందుంచడంలో వారు సీరియస్‌గా లేనట్లు తెలుస్తోందని విమర్శించారు. ఒక వ్యక్తి (మోడీ) ఆధారంగా బీజేపీ ప్రచారం నడుస్తోందని దుయ్యబట్టారు.