నదీ జలాల వినియోగంపై ఉన్నతస్థాయి మండలి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న ప్రకారం నదీ జలాల వినియోగంపై ఉన్నతస్థాయి మండలి ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ గురువారం నిర్ణయించింది. దీంతో నదీ జల వనరుల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య సమన్వయానికి ప్రత్యేకంగా అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటుకానుంది. దీంతో పాటు కేబినెట్ తీసుకున్న పలు ఇతర నిర్ణయాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేశ్ మీడియాకు వెల్లడించారు. ‘రాష్ర్ట విభజన చట్టంలో పేర్కొన్న పలు అంశాలకు సంబంధించి కేంద్ర కేబినెట్ గురువారం లాంఛనప్రాయంగా పలు నిర్ణయాలు తీసుకుంది. చట్టంలో సెక్షన్ 84(1) కింద పేర్కొన్న విధంగా కృష్ణా, గోదావరి నదీ జల వనరుల అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దీనికి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. కొత్త ప్రాజెక్టులకు అనుమతులు, నీటి వనరుల ప్రణాళిక, వివాదాల పరిష్కారం దీని పరిధిలోనే ఉంటుంది. సమయానుకూలంగా సమావేశాలు జరుపుతుంది.
ఒకరకంగా చెప్పాలంటే ఇది రాజకీయపరమైన విధానాలకు సంబంధించిన కమిటీ. ఇక సెక్షన్ 91 ప్రకారం తుంగభద్ర నదీ జలాల బోర్డు పునర్వ్యవస్థీకరణకూ కేబినెట్ ఆమోదం తెలిపింది. కర్ణాటకతో పాటు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ విభజనతో ఏర్పడే రెండు రాష్ట్రాలు ఇందులో భాగస్వాములుగా ఉంటాయి. అలాగే విభజన చట్టంలోని సెక్షన్ 85(1)కి అనుగుణంగా కృష్ణా నదీ జలాల నిర్వహణ బోర్డు, గోదావరి నదీ జలాల నిర్వహణ బోర్డుల ఏర్పాటుకు వీలుగా కొన్ని పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రెండు బోర్డుల్లోనూ చైర్మన్, సభ్య కార్యదర్శి, చీఫ్ ఇంజనీర్, ఓ స్వతంత్ర నిపుణుడు ఉంటారు. వీరిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఇప్పటికే ఎంపిక ప్రారంభమైంది. వచ్చే నెలలో నియామకం పూర్తవుతుంది. అలాగే ఇరు రాష్ర్ట ప్రభుత్వాల తరఫున నామినీలుగా చీఫ్ ఇంజనీర్లు ఉంటారు. కృష్ణా నదీ జలాల వివాదాలపై పనిచేస్తున్న బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కాలపరిమితి మొన్నటి జనవరి 31తో ముగిసింది. నీటి కేటాయింపులపై ఈ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. అయితే అది అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ కోసం ఉద్దేశించినది. ఇప్పుడు రాష్ట్రం విడిపోయినందున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు నీటి కేటాయింపులు తేల్చాల్సి ఉంది. అందువల్ల ట్రిబ్యునల్ కాలవ్యవధిని జూలై 31 వరకు పొడిగించేందుకు కేబినెట్ ఆమోదించింది. అవసరాన్ని బట్టి మరో ఆరునెలలకోసారి పొడిగించవచ్చు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ఈ ట్రిబ్యునల్‌కు అదనపు విధివిధానాలు కేటాయించారు. రెండు రాష్ట్రాలకు ప్రాజెక్టువారీగా నిర్ధిష్ట నీటి కేటాయింపులు జరపడం, నీటి లోటు ఉన్న సంవత్సరాల్లో ప్రాజెక్టువారీగా నీటి విడుదలకు ప్రాధాన్యాలను బట్టి కార్యాచరణ(ఆపరేషనల్ ప్రొటోకాల్) నిర్దేశించడం వంటివి ట్రిబ్యునల్ నిర్ణయిస్తుంది’ అని జైరాం వివరించారు. పోలవరం నిర్మాణానికి అవసరమైన కార్పొరేషన్ ఏర్పాటుకు తదుపరి కేబినెట్ భేటీలో ఆమోదం లభిస్తుందని ఆయన చెప్పారు.
ప్రభుత్వ వ్యతిరేకతే కాంగ్రెస్‌కు సవాలు: జైరాం
పదేళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోందని కేంద్ర మంత్రి జైరాం రమేశ్ అంగీకరించారు. వివరించి చెప్పలేని అధినాయకత్వం కారణంగా అవగాహన కల్పనలో పార్టీ వైఫల్యం సవాలుగా మారిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ప్రచారం కూడా ఓ సవాలేన ని అంగీకరించిన జైరాం.. ఏదిఏమైనా కాంగ్రెస్ మంచి, గౌరవప్రదమైన మూడంకెల సంఖ్యను తప్పకుండా సాధిస్తుందని గురువారం పీటీఐతో మాట్లాడుతూ చెప్పారు. ‘ఒకవైపు అతిచురుకైన న్యాయవ్యవస్థ, కాగ్ వంటి అతిగా వ్యవహరించే రాజ్యాంగ సంస్థలు, మీడియూ దూకుడు, బాధ్యతారహితమైన పౌరసమాజం.. మరోపక్క మావైపు నుంచి స్పందన అంత వేగంగా లేదు..ఇవన్నీ దాటివచ్చాం’ అని పేర్కొన్నారు.