యూపీఏపై అవిశ్వాసం | no trust motion against upa | Sakshi
Sakshi News home page

యూపీఏపై అవిశ్వాసం

Published Tue, Dec 10 2013 1:29 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

యూపీఏపై  అవిశ్వాసం - Sakshi

యూపీఏపై అవిశ్వాసం


 గతంలో చేసిన రాజీనామాలు ఉపసంహరించుకున్న వైనం
 అవిశ్వాసంపై సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల్లో ఏకాభిప్రాయం కరువు
 19 మంది సీమాంధ్ర కాంగ్రెస్ సభ్యుల్లో సంతకాలు చేసింది ఆరుగురే
 యూపీఏపై అవిశ్వాసానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సై
 కాంగ్రెస్ ఎంపీలే తమ నాయకత్వాన్ని తప్పుపడుతున్న విషయాన్ని
 హైలైట్ చేయడానికి.. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని దేశానికి చూపేందుకు అది ఉపయోగపడుతుంది: జగన్‌మోహన్‌రెడ్డి
 కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ సీమాంధ్ర ఎంపీల అవిశ్వాసం నోటీసు
 అవిశ్వాసానికి మూడు పార్టీల నుంచీ 13 మంది ఎంపీల మద్దతు
 కనీసం 50 మంది మద్దతు ఉంటేనే సభలో పెట్టేందుకు అనుమతి


 సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన ముసాయిదా బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించటంతో.. ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు.. సొంత పార్టీ నేతృత్వంలోని యూపీఏ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ లోక్‌సభ స్పీకర్‌కు నోటీసు అందించారు. కాంగ్రెస్ ఎంపీలు రాయపాటి సాంబశివరావు, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్‌కుమార్, ఎ.సాయిప్రతాప్, లగడపాటి రాజగోపాల్, జి.వి.హర్షకుమార్ సోమవారం ఉదయం ఈమేరకు స్పీకర్ మీరాకుమార్‌కు నోటీసు ఇచ్చారు.
 
 అయితే.. సీమాంధ్ర ప్రాంతం నుంచి కాంగ్రెస్‌కు మొత్తం 19 మంది లోక్‌సభ సభ్యులు ఉండగా.. వారిలో ఆరుగురు మాత్రమే నోటీసుపై సంతకాలు చేయటం విశేషం. సీమాంధ్ర కేంద్రమంత్రులు సహా మిగతా లోక్‌సభ సభ్యులు ‘అవిశ్వాసం’పై స్పందించకపోవటం గమనార్హం. దీన్ని బట్టి.. అవిశ్వాసం విషయంలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల మధ్యే ఏకాభిప్రాయం లేదని స్పష్టమవుతోంది. మరోవైపు.. స్వయంగా కాంగ్రెస్ ఎంపీలే సొంత పార్టీ సర్కారుపై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వటంతో.. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, యూపీఏ సర్కారు పెద్దల తప్పుడు నిర్ణయాన్ని యావద్దేశం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా యూపీఏపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధపడింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సహ నాయకులతో చర్చించి.. అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు.
 
 ఈ మేరకు సిద్ధంచేసిన నోటీసుపై ఆయనతో పాటు ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్.పి.వై.రెడ్డి సంతకాలు చేసి స్పీకర్ కార్యాలయంలో అందజేశారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల్లో ఐకమత్యం లేనప్పటికీ.. అవిశ్వాస తీర్మానం విషయంలో స్పష్టత లేనప్పటికీ.. రాష్ట్ర విభజన విషయంలో అసెంబ్లీలో తీర్మానం లేకుండా కాంగ్రెస్ ఓట్లు, సీట్ల కోసం ఏకపక్షంగా నిరంకుశ విభజనకు దిగిన వైనాన్ని.. ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయాన్ని దేశ ప్రజలందరికీ వివరించేందుకు.. అవిశ్వాసానికి తాము మద్దతు ప్రకటించినట్లు వైఎస్ జగన్‌తెలిపారు. సోమవారం ఢిల్లీలో జేడీఎస్ అధినేత దేవెగౌడతో కలిసి జగన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎంపీలే కేంద్ర ప్రభుత్వం కూలిపోవాలని కోరుకుంటున్నారని.. కాంగ్రెస్ ఎంపీలే సొంత పార్టీ నాయకత్వాన్ని వద్దనుకుంటున్న విషయాన్ని హైలైట్ చేయటానికి అవిశ్వాసానికి తమ మద్దతు ఉపయోపడుతుందని పేర్కొన్నారు.

 

మరోవైపు.. టీడీపీ కూడా అవిశ్వాస తీర్మానానికి ముందుకొచ్చింది. ఆ పార్టీ తరఫున సీమాంధ్ర ఎంపీలు కె.నారాయణరావు, మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఎన్.శివప్రసాద్, నిమ్మల కిష్టప్పలు సంతకాలు చేసి నోటీసు ఇచ్చారు. అవినీతి, కుంభకోణాలు, ప్రజావ్యతిరేక పాలనతో అన్ని రంగాల్లో విఫలమైన యూపీఏ ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటూ వారు ఆ తర్వాత మీడియా ఎదుట వ్యాఖ్యానించారు. కానీ.. ఈ నోటీసు ఇవ్వటానికి కారణం సమైక్యాంధ్రకు మద్దతుగా అని కానీ, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అని కానీ వారు చెప్పలేదు. పార్టీ తెలంగాణ ఎంపీలు సంతకాలు చేయకుండా కేవలం సీమాంధ్ర ప్రాంత ఎంపీల సంతకాలతోనే నోటీసు ఇచ్చిన టీడీపీ నేతల్లో.. అసలు ఇది ఎందుకు ఇచ్చామన్న స్పష్టత ఏ కోశానా లేకపోవటం విశేషం.
 
 కనీసం 50 మంది సభ్యుల మద్దతు ఉంటేనే చర్చ...
 
 ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలతో సహా మూడు పార్టీల తరఫున మొత్తం 13 మంది ఎంపీలు అవిశ్వాసం నోటీసులు ఇచ్చినట్లయింది. ప్రస్తుతం ఈ నోటీసులు స్పీకర్ మీరాకుమార్ పరిశీల నలో ఉన్నాయి. సభ సజావుగా జరిగిన పక్షంలో స్పీకర్ మొదటి ప్రాధాన్యతా అంశంగా తీసుకుని అవిశ్వాస తీర్మానం నోటీసులను సభలో చదివి సభ అభిప్రాయాన్ని కోరతారు. స్పీకర్ ఇలా కోరినపుడు కనీసం యాభై మంది సభ్యులు నిలబడి నోటీసుకు మద్దతు తెలిపితే అప్పుడు స్పీకర్ అవి శ్వాస తీర్మానాన్ని సభలో పెట్టడానికి అనుమతి మంజూరు చేస్తారు. ఆ తర్వాత అన్ని పక్షాలతో చర్చించి.. అవిశ్వాస తీర్మానం ఏ రోజున పెట్టాలి? దానిపై చర్చకు ఎంత సమయం కేటాయించాలి? ఎప్పుడు ఓటింగ్ జరపాలి? అనే అంశాలను స్పీకర్ నిర్ణయిస్తారు.
 
 కాంగ్రెస్ ఎంపీల రాజీనామాల ఉపసంహరణ...
 
 రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా గతంలో పలువురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు చేసిన రాజీనామాలు స్పీకర్ తిరస్కరించిన విషయం తెలిసిందే. ఆరుగురు సీమాంధ్ర ఎంపీలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలనే నిర్ణయానికి రావటంతో.. వారు ముందుగా స్పీకర్‌ను కలిసి రాజీనామాలు ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. దీనికి ఆమె నుంచి ఆమోదం లభించిన వెంటనే ఎంపీలు మరోమారు సమావేశమై అవిశ్వాస తీర్మానం నోటీసు తయారు చేశారు. దీన్ని స్వయంగా ఎంపీ సబ్బంహరి స్పీకర్‌కు అందించారు. సమైక్యాంధ్ర విషయంలో అటు పార్టీ, ఇటు కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం నైతికంగా వ్యవహరించలేదని ఎంపీ సబ్బం హరి విమర్శించారు. తమ అభిప్రాయాలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని.. అలాంటి సొంత ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇస్తే, తమ నైతికతకు వచ్చే ఇబ్బందేమీ లేదని వ్యాఖ్యానించారు.  ‘సీమాంధ్ర కేంద్రమంత్రులు సహకరిస్తారా?’ అని అడగగా.. వారి విషయం తమకు తెలియదని హరి పేర్కొన్నారు.
 ఊహించిందే.. అధిగమిస్తాం: కాంగ్రెస్
 
 సొంత పార్టీ ఎంపీలే అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడంతో కాంగ్రెస్ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ సోమవారం పల్లం రాజు, సబ్బం హరి, లగడపాటి రాజగోపాల్‌లతో సుదీర్ఘంగా చర్చించారని.. అవిశ్వాసంపై వెనక్కుతగ్గాలని సూచించారని సమాచారం. ఇదిలావుంటే.. అవిశ్వాస తీర్మానం ముందుగా ఊహించిందేనని.. దాన్ని సమర్థవంతంగా అధిగమిస్తామని ఏఐసీసీ అధికార ప్రతినిధి పి.సి.చాకో పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement