* ఎంపీల సస్పెన్షన్ తీర్మానంపై ఓటింగ్‌కు డిమాండ్ చేసిన సుష్మాస్వరాజ్
* అర్థంతరంగా వాయిదాపడిన లోక్‌సభ
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో గురువారం హైడ్రామా నడిచింది. రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలనే డిమాండ్‌తో లోక్‌సభను స్తంభింపజేసిన 11 మంది సీమాంధ్ర ఎంపీలను ప్రస్తుత లోక్‌సభ వర్షాకాల సమావేశాలు ముగిసేంతవరకూ సస్పెండ్ చేయాలనే ప్రభుత్వ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ప్రతిపక్షం, యూపీఏకి మద్దతునిస్తున్న పార్టీలు ముక్తకంఠంతో వ్యతిరేకించడంతో తీవ్ర గందరగోళం మధ్య తీర్మానాన్ని ఆమోదించకుండానే సభ అర్థంతరంగా శుక్రవారానికి వాయిదా పడింది.
విభజన నిర్ణయానికి నిరసనగా సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్న సభ్యులను సస్పెండ్ చేయాలని కోరుతూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ తీర్మానం ప్రతిపాదించారు. మంత్రి సభ్యుల పేర్లు చదవడం ప్రారంభించగానే కలకలం రేగింది. బీజేపీ, శివసేన, అకాలీదళ్, జేడీ(యూ), బీజేడీ, సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే తదితర పార్టీల సభ్యులంతా లేచి నిలబడి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
తెలంగాణ డిమాండ్‌ను సమర్థిస్తున్నప్పటికీ నిర్ణయం తీసుకోవడంలో కాంగ్రెస్ అనుసరించిన విధానం ఆమోదయోగ్యం కాదని, కాంగ్రెస్ వైఖరి కారణంగానే లోక్‌సభను సజావుగా నిర్వహించుకోలేని దుస్థితి ఎదురైందని ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ ధ్వజమెత్తారు. సభ్యుల సస్పెన్షన్‌ను ఆమోదించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గందరగోళ పరిస్థితుల మధ్యనే స్పీకర్ మీరాకుమార్ సస్పెన్షన్ తీర్మానంపై మూజువాణి ఓటును కోరే ప్రయత్నం చేయడంతో ప్రతిపక్ష నేత మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభ యావత్తూ వ్యతిరేకిస్తున్నా తీర్మానాన్ని ఉపసంహరించుకోకపోతే సస్పెన్షన్ తీర్మానంపై ఓటింగ్ జరపాలని డిమాండ్ చేశారు. అప్పటికే వెల్‌లో ఉన్న టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం ముందున్న మైకులను విరగ్గొట్టే ప్రయత్నం చేశారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు కూడా వెల్‌లోకి ప్రవేశించడంతో స్పీకర్ సభను అరగంటపాటు వాయిదా వేశారు. తర్వాత సభ తిరిగి సమావేశమైనా పరిస్థితిలో ఎలాంటి మార్పూ రాలేదు.
దీంతో సభాధ్యక్ష స్థానంలో ఉన్న ఫ్రాన్సిస్కో సార్డిన్హా సభను శుక్రవారానికి వాయిదా వేశారు. అనంతరం తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సభ్యులు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాజయ్య తదితరులు ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ సీటు వద్దకు వెళ్లి సీమాంధ్ర ఎంపీలను ఎందుకు సమర్థిస్తున్నారంటూ ఆమెతో వాదనకు దిగారు.
అంతకుముందు ఉదయం సభ ప్రారంభమైనప్పుడు బీజేపీ సభ్యులు బొగ్గు శాఖలో గల్లంతైన ఫైళ్ల వ్యవహారంపై ప్రధాని వివరణ ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో కొద్దిసేపటికే సభ వాయిదాపడింది. తిరిగి ప్రారంభమైనప్పుడు సీమాంధ్ర సభ్యుల సస్పెన్షన్ ప్రయత్నంతో సభ మరుసటిరోజుకు వాయిదా పడింది. ఫలితంగా గురువారం కూడా ఆహార భద్రత బిల్లు పరిశీలన సాధ్యపడలేదు. ప్రతిష్టంభనను తొలగించేందుకు స్పీకర్ మీరాకుమార్ శుక్రవారం ఉదయం పది గంటలకు అన్ని పక్షాల నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
లోక్‌సభలో సభ్యుల సస్పెన్షన్‌కు బ్రేక్
Published Fri, Aug 23 2013 1:50 AM | Last Updated on Sat, Jun 2 2018 4:41 PM
Advertisement
Advertisement