
వంట గ్యాస్ పై నగదు బదిలీకి ఆమోద ముద్ర
న్యూఢిల్లీ: గతంలో వంట గ్యాస్ పై యూపీఏ ప్రభుత్వ చేపట్టిన నగదు బదిలీకి పథకం మరోసారి అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం శనివారం ఆమోద ముద్ర వేసింది. ఈ నగదు బదిలీ పథకం నవంబర్ నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్ర కేబినెట్ స్పష్టం చేసింది. గ్యాస్ ధరపై కొత్త విధానానికి శ్రీకారం చుట్టనున్న కేంద్ర కేబినెట్ ఈ రోజు సమావేశమైంది. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి గ్యాస్ ధరపై పునఃసమీక్ష నిర్వహిస్తామని కేంద్ర కేబినెట్ తెలిపింది. ప్రతీ ఏటా ఏప్రిల్ 1 వ తేదీన, అక్టోబర్ 1 వ తేదీన గ్యాస్ ధరపై సమీక్ష చేపట్టనుంది. యూనిట్ ధరను 5.61 యూఎస్ డాలర్ గా నిర్దారిస్తూ నిర్ణయం తీసుకుంది.
వంట గ్యాస్ కు పూర్తి స్థాయిలో నగదు బదిలీకి పథకాన్ని అమలు చేస్తామని.. దీంతో వినియోగదారుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా సబ్సిడీని వర్తింపజేస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం.. యూపీఏ అమలు చేసిన పథకాన్నిఎత్తివేసిన సంగతి తెలిసిందే. అప్పటి వరకూ ఆధార్ అనుసంధానంతో గ్యాస్ సబ్సిడీని పొందిన వంట గ్యాస్ వినియోగదారులకు కొంత ఊరట లభించింది. అయితే తాజాగా అదే పథకాన్ని తెరపైకి తీసుకురావడంతో ఆధార్ ను బ్యాంక్ ల్లో అనుసంధానం చేసుకోవాల్సిన పరిస్థితి. దేశంలో అధిక సంఖ్యలో ఆధార్ నమోదు చేసుకున్నా.. ఇంకా చాలా మందికి ఆధార్ నంబర్ లభించలేదు. ఈ పథకంతో పూర్తి స్థాయి లబ్ధి చేకూరాలంటే మాత్రం వినియోగదారులకు ఆధార్ తిప్పలు తప్పకపోవచ్చు. అయితే త్వరలో అమల్లోకి రానున్న నగదు బదిలీ పథకాన్ని మరింత సమర్ధవంతంగా నిర్వహిస్తామని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు.