జమ్ము కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగానైనా సైనిక దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని (ఏఎఫ్‌ఎస్‌పీఏ) ఎత్తివేయాలని, అవసరమైతే మళ్లీ విధించవచ్చని రాష్ర్ట ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఇటీవల కేంద్రాన్ని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, విపక్షంలోని కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఇప్పటికీ మౌనం పాటిస్తున్నాయి. మొదటి నుంచి కశ్మీర్ విషయంలో సైనిక దళాల పక్షాన నిలబడుతూ వచ్చిన బీజేపీ ముఫ్తీ డిమాండ్‌ను పరిశీలిస్తుందని ఎవరూ ఊహించం లేం. అనేక సందర్భాల్లో ఈ చట్టాన్ని ఎత్తివేసేందుకు అవకాశం వచ్చినా పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు స్పందిస్తుందని కూడా ఆశించలేం. వామపక్షాలు, మైనారిటీల పక్షాన నిలిచే పార్టీలైనా స్పందించవచ్చు గదా? అన్నది విజ్ఞుల ప్రశ్న. ఈ వివాదాస్పద చట్టాన్ని ఎత్తివేయడమే ప్రధాన నినాదంగా అధికారంలోకి వచ్చిన మెహబూబా ముఫ్తీకి చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ మిత్రపక్షమైన బీజేపీపై ఒత్తిడి తీసుకరాచ్చు కదా! అన్నది ఆ పార్టీల ఎదురు ప్రశ్న.
అవును, అదీ నిజమే. ప్రజల సానుభూతి పవనాలతో అధికారంలోకి వచ్చిన పీడీపీ పార్టీ ప్రధాన ఎన్నికల నినాదాల్లో సైనిక దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని ఎత్తివేయాలన్నది ఒకటి. అందుకనే రాష్ట్రంలో బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆమె ఈ వివాదాస్పద చట్టాన్ని సమీక్షించాలని షరతు విధించారు. అందుకు బీజేపీ ససేమిరా అంగీకరించలేదు. కొన్ని నెలలపాటు ఈ అంశంపై ఇరు పార్టీల మధ్యన ప్రతిష్టంభన ఏర్పడింది. చివరకు పొత్తులో భాగంగా సైనిక దళాల ప్రత్యేకాధికారాల చట్టం స్థానే ‘కల్లోలిత ప్రాంతాల చట్టం’ను సమీక్షిస్తామంటూ అతి తెలివితో అంగీకారం కుదుర్చుకున్నారు.
1998లోనే కశ్మీర్‌లో కాలం తీరిపోయిన కల్లోలిత ప్రాంతాల చట్టాన్ని ఇప్పుడు సమీక్షించడం ఏమిటీ? ఏ రాష్ట్రంలోనైనా ఆరు నెలలకు మించి కల్లోలిత ప్రాంతాల చట్టాన్ని అమలు చేయకూడదని, దాన్ని పొడిగించదల్చుకుంటే ఆ రాష్ట్ర శాసన సభ ఆమోదం తప్పనిసరి అని కోర్టు 1998లోనే తీర్పుచెప్పింది. అప్పటి నుంచి కల్లోలిత ప్రాంతాల చట్టాన్ని పక్కన పెట్టి అప్పటికే అమల్లోకి వచ్చిన సైనిక దళాల ప్రత్యేకాధికారాల చట్టం కింద కశ్మీర్ ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించారు. 2001లో సైనిక దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని జమ్మూలోని ఇతర ప్రాంతాలకు విస్తరింపచేశారు.
వివాదాస్పదమైన ఈ చట్టాన్ని మొదటిసారి నాగాల తిరుగుబాటును అణచివేసేందుకు నాగాలండ్‌లో 1958లో ప్రవేశపెట్టారు. 1990లో ఇతర ఈశాన్య రాష్ట్రాలకు విస్తరించారు. మణిపూర్‌లో ఈ చట్టాన్ని ఎత్తివేయాలంటూ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిలా 16 ఏళ్లపాటు సుదీర్ఘ పోరాటం చేసి అలసిపోయారు. ఈ చట్టాన్ని సమీక్షించాలని కోరుతూ 2004లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం జస్టిస్ బీపీ జీవన్ రెడ్డితో ఓ కమిషన్‌ను నియమించింది. ఈ వివాదాస్పద చట్టాన్ని ఎత్తివేయాలంటూ ఆ కమిషన్ కేంద్రానికి సిఫారసు చేసింది. కేంద్రమంత్రి చిదంబరం ఆ సిఫారసుకు మద్దతు పలికినా, కేంద్ర కేబినెట్ దాన్ని తోసిపుచ్చింది. చర్చల ప్రక్రియలో భాగంగా 2011లో కశ్మీర్‌లో పర్యటించిన కేంద్రం దూతలు కూడా ఈ వివాదాస్పద చట్టాన్ని సమీక్షించాలని సిఫార్సు చేశారు. అయినా కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకుంటుందన్న ఆశ అసలే లేదు.
--ఓ సెక్యులరిస్ట్ కామెంట్
(ఎలాంటి వారెంటు లేకుండా ఎవరినైనా తనిఖీ చేసి అరెస్ట్ చేసే అధికారాన్ని ఈ సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం కల్పిస్తోంది. ఆందోళనలను అణచివేయడంలో భాగంగా అత్యవసర సమయాల్లో ఏకపక్షంగా కాల్పులు జరపొచ్చు. ఇలాంటి కేసులను కేంద్రం అనుమతిస్తే తప్ప పౌర కోర్టులకు విచారించే అధికారం లేదు. సైనిక కోర్టులే విచారించాలి. 2010 ఆందోళనలు అణచివేయడంలో భాగంగా సైనికులు జరిపిన కాల్పుల్లో 120 మంది కశ్మీర్ యువకులు మరణించారు)
ఆ వివాదాస్పద చట్టాన్ని ఎత్తివేయరా?
Published Sat, Jul 30 2016 4:07 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM
Advertisement